AP students
AP students : ఏపీలో ( Andhra Pradesh) ఎండలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమవుతున్నాయి. వేసవి సీజన్ ప్రారంభంలోనే ప్రతాపం చూపుతున్నాడు భానుడు. ఉదయం 8 గంటల నుంచి ఎండలు ప్రారంభమవుతున్నాయి. మధ్యాహ్నం నాటికి అమాంతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో గత ఏడాది కంటే ముందే ఆఫ్ డే స్కూల్స్ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరికలతోనే ఏపీ ప్రభుత్వం హాఫ్ డే సెలవులపై నిర్ణయం మార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి ఎండల తీవ్రత ఉండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అప్పుడే ఎండ తాకిడికి గురవుతున్నారు. వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్నారు.
* గత ఏడాది ముందస్తుగానే
సాధారణంగా మార్చి 15 నుంచి పాఠశాలలకు హాఫ్ డేస్( half days ) ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత ఏడాది ఎండల తీవ్రత దృష్ట్యా అంతకంటే ముందే ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. ఈసారి ఇంకాస్త ముందుగానే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందినట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రతను పరిగణలోకి తీసుకొని త్వరగా ఒంటిపూట బడులు ప్రారంభించాలని కోరినట్లు సమాచారం.
* ఫిబ్రవరి రెండో వారం నుంచి
ఈ ఏడాది ఫిబ్రవరి( February) రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని జిల్లాల్లో అయితే 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ దశాబ్దపు చరిత్రలోనే ఈ ఏడాది అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు అవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అందుకే పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
* విద్యా సంవత్సరం క్యాలెండర్ లో
ఈ విద్యా సంవత్సరం( academic year ) క్యాలెండర్ లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు అని స్పష్టతనిచ్చారు. కానీ రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా.. ఒంటిపూట బడులు ముందుగానే ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరో వారంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురవుతుంది. తప్పకుండా ప్రభుత్వం ఒంటిపూట బడులను కాస్త ముందుగానే ఇచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.