Amaravathi capital : అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా అమరావతిని యధాస్థానానికి తీసుకొచ్చి.. నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్రం బడ్జెట్లో15వేల కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో సందర్శించింది. 2050 నాటి అవసరాలకు తగ్గట్టు నవ నగరాల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం వారికి స్పష్టం చేసింది. అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరింది. అయితే కేవలం ఆర్థిక సాయం కాదు.. కీలక ప్రాజెక్టులకు సైతం కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు లను నిర్మించేందుకు ముందుకొచ్చింది. భూ సేకరణ నుంచి నిర్మాణం వరకు అంతా కేంద్రమే భరించనుంది. మరోవైపు అమరావతి రాజధానికి కలుపుతూ కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. రాజధాని అమరావతికి విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానం పెరిగేలా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఇదివరకే ఆమోదం తెలిపింది. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఈ రైల్వే లైన్ అంశం మరుగున పడిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో శరవేగంగా నివేదికలు సిద్ధమవుతున్నాయి. రూ.2047 కోట్లతో 56 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించి బ్రాడ్ గేజ్ మార్గం అందుబాటులోకి రానుంది. డిపిఆర్ ను సైతం రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ ఆమోద ముద్ర వేసినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
* కృష్ణానదిపై భారీ వంతెన
అయితే ఈ కొత్త రైల్వే లైన్ కు సంబంధించి కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.కొత్తపేట- వడ్డమాను గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల మేర వంతెన నిర్మించనున్నారు. ఎర్రుపాలెం-అమరావతి- నంబూరు మధ్య 56 కిలోమీటర్ల మేర కొత్త మార్గం నిర్మిస్తారు. ముందుగా సింగిల్ లైన్ నిర్మాణం చేపడతారు. దీనికోసం గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలో భూసేకరణ చేయనున్నారు. భూ సేకరణతో పాటు రైల్వే లైన్ నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చూడనుంది.
* మిగతా నగరాలతో అనుసంధానం
ఈ రైల్వే లైన్ నిర్మాణంతో అమరావతి రాజధాని కి మిగతా నగరాలతో అనుసంధానం కలగనుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ లైన్ నిర్మాణం చేపడుతున్నారు. అమరావతి నుంచి పెద్దకూరపాడు వరకు 25 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు 25 కిలోమీటర్ల చొప్పున 106 కిలోమీటర్ల మేరా కొత్త లైన్ నిర్మించేందుకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది.
* పెద్ద రైల్వే స్టేషన్ గా అమరావతి
ఇక హైదరాబాదు నుంచి వచ్చే రైల్వే లైన్ కు సంబంధించి ఎర్రుపాలెం వద్ద ఈ మార్గం యూటర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి అమరావతి మీదుగా విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చినరావుపాలెం,గొట్టుముక్కల,పరిటాల,కొత్తపేట,వడ్డమాను,అమరావతి,తాడికొండ, కొప్పు రావూరులలో రైల్వేస్టేషన్లు నిర్మించనున్నారు. అమరావతిని పెద్ద స్టేషన్గ తీర్చిదిద్దనున్నారు.