Amaravathi capital : అమరావతి.. చరిత్రపుటల్లో ఈ పేరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతకుమించి ప్రాశస్త్యం ఉంది.చరిత్రకు అందనంత ప్రాచీన కాలంలోనే ఆంధ్ర శాతవాహనుల రాజధాని నగరంగా దక్షిణ- తూర్పు ఆసియా దేశాలలో అమరావతి ఎంతో పేరుగాంచింది. బుద్ధులు నడయాడిన నేలగా.. బౌద్ధారామంగా విలసిల్లింది. అటు చరిత్రకు ఆనవాళ్లుగా, ఇక రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండే నగరంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు. దీనికి అందరూ ఆమోదం తెలిపారు. తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2014 నుంచి 2019 మధ్య అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. కానీ దురదృష్టవశాత్తు గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం నిర్వీర్యమైంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది. వడివడిగా పూర్తిచేసేందుకు సీఎం చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకోవడంలో కొంత సక్సెస్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో అపురూపంలో 15 వేల కోట్ల రూపాయలు నిధులు దక్కించుకున్నారు. అయితే ఈ నాలుగేళ్లలో వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విరాళాల ద్వారా పదివేల కోట్ల వరకు రాబట్టేందుకు డిసైడ్ అయ్యారు. గతంలో కూడా చంద్రబాబు అమరావతికి విరాళాలు సేకరించారు. ఆన్లైన్లో ఇటుకుల అమ్మకాల పేరిట విరాళాలు సేకరించగలిగారు.
* అప్పట్లో ఇటుకల పేరిట విరాళాల సేకరణ
2017 నుంచి 2019 మధ్య ఆన్లైన్ లో అమరావతిలో ఒక్కో ఇటుకకు పది రూపాయలు చొప్పున విరాళాలు సేకరించారు. అప్పట్లో ఈ కార్యక్రమానికి భారీగా స్పందన వచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా అకౌంట్ ఏర్పాటు చేసి విరాళాల రూపంలో సేకరించారు. దేశ విదేశాల్లోని ఏపీ ప్రజలు ఇటుకలకు లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చారు. మరోసారి ఇటుకుల విరాళాలను ప్రారంభించనున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి పాత ప్రణాళికలను కొత్తగా అమలు చేసేందుకు రెడీ అయ్యారు. దీనివల్ల కొంతమేరకు నగదు సమకూరుతుందని ఆశాభావంతో ఉన్నారు.
* ఇంతలో ప్రపంచ బ్యాంకు రుణం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15000 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా ఇప్పించగా.. ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో పర్యటించింది. వీలైనంత త్వరగా నిధులు మంజూరుకు హామీ ఇచ్చింది. అది వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. ఇంతలో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా పూర్తికానున్నాయి. మరోవైపు అమరావతి నిర్మాణాలపై నిపుణులు ఒక నివేదిక ఇచ్చారు. దానిని అనుసరించి నిర్మాణాలపై ఒక నిర్ణయం తీసుకున్నారు.
* బౌద్ధ గురువుకు బాధ్యతలు
మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి బౌద్ధ గురువులు సైతం సాయం అందించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దలైలామా నేతృత్వంలో విరాళాలు సేకరిస్తే.. భారీగా నిధుల సమీకరణ జరుగుతుందని చంద్రబాబు ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో దలైలామా 2006 సమయంలో అమరావతిలో బౌద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడి చరిత్ర, ప్రాశస్త్యం ఆయనకు తెలుసు. బౌద్ధులకు అమరావతి అత్యంత పవిత్ర ప్రాంతంగా ఉంటుంది. అందుకే దలైలామా ఇచ్చిన పిలుపుకు భారీగా రెస్పాన్స్ వస్తుందని.. నిధుల సమీకరణ ఈజీ అవుతుందని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమరావతి ఇక శరవేగంగా పరుగులు పెట్టడం ఖాయం.