Amaravati Assigned Lands Farmers: అమరావతి( Amravati capital ) విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి నిర్మాణానికి అసైన్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట దక్కేలా.. వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని లేకుండా చర్యలు తీసుకున్నారు. అసైన్డ్ అనే పదం తీసి పట్టా భూమి అని పేర్కొన్నాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అసైన్డ్ భూమిలో రిటర్నబుల్ ప్లాట్ వస్తే పట్టా భూమిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పూలింగ్ చట్టంలోని క్లాజ్ మారుస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తరువు విడుదల చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంలో సేకరించిన భూముల్లో అసైన్డ్ కూడా ఉంది. అటువంటి వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ లలో సైతం అసైన్డ్ అనే పదం ఉంది. దీంతో అమ్ముకునేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రభుత్వానికి రైతులు విన్నవించడంతో ఈరోజు సానుకూల నిర్ణయం తీసుకుంది.
అమ్ముకునేందుకు వీలుగా..
ఏపీ ప్రభుత్వం( AP government) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అసైన్డ్ భూముల రైతులు వారికి ఇచ్చిన ప్లాట్లను ఇతరులకు అమ్ముకునేందుకు వీలు కలిగింది. మరోవైపు అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్ లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొందరికి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదని.. సిఆర్డిఏ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. కొద్ది రోజుల కిందట ఈ రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి రుణాలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కానీ కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. మార్గదర్శకాలు లేవని.. ఏవేవో సాంకేతిక కారణాలు చెబుతున్నారు. సరైన రూల్స్ లేవని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై కూడా సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. జూలైలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. కానీ కొన్ని బ్యాంకులు ఇంకా నిబంధనల పేరుతో రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
కౌలు చెల్లింపు
అమరావతి రైతుల విషయంలో కూటమి( Alliance ) ప్రభుత్వం ఆది నుంచి సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే నిలిచిపోయిన కౌలు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అయింది అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లింపు ప్రారంభించింది. రెండుసార్లు చెల్లింపులు పూర్తి చేసింది. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్ ల విషయంలో అడ్డంకులు తొలగించింది. అయితే ఇటీవల తాము అధికారంలోకి వస్తే రైతుల రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ధి చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం అధికం అవుతుందని.. అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అందుకే అసైన్డ్ భూములు ఇచ్చినవారికి తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు పొందితే.. వాటికి అసైన్డ్ అనే పదం లేకుండా ప్రభుత్వం తొలగించింది. దీంతో అమరావతి రైతులకు ఉపశమనం దక్కింది.