Chandrababu focused on Uttarandhra: సాధారణంగా ముందు పాలించిన పార్టీల వైఫల్యాలను అధిగమించి.. తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. రాజకీయంలో ప్రతీది అనుభవమే కూడా. ఎంత సీనియర్ అయినా పరిస్థితులకు తగ్గట్టు వెళ్లాలి. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది అదే. వైసిపి హయాంలో పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అంతకుముందు చంద్రబాబు అమరావతి నిర్మాణం పేరుతో ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేశారని వైసీపీ చెప్పుకొచ్చింది. ఉమ్మడి ఏపీలో అలానే చేసి హైదరాబాదును చంద్రబాబు అభివృద్ధి చేశారని.. అందుకే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వచ్చిందని అప్పట్లో వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. అందుకే తాము మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టి.. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బయటకు చెప్పడం లేదు కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
రెండు ప్రాంతాలపై ఫోకస్..
ప్రధానంగా రాయలసీమతో( Rayalaseema) పాటు ఉత్తరాంధ్ర పై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పవర్ ఫుల్ గా ఉన్నారు. వీరి పర్యటనలు చూస్తే మాత్రం ఇట్టే అర్థమవుతోంది. ప్రధానంగా చంద్రబాబుతో పాటు లోకేష్ నిత్యం రాయలసీమ, విశాఖ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు విషయంలో చంద్రబాబు చొరవ చూపుతున్నారు. ఆపై ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం.. ప్రతి నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఏదో ఒక జిల్లాను పర్యటిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో సైతం రాయలసీమ జిల్లాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. లోకేష్ సైతం పర్యటనలు చేస్తున్నారు. తరచూ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వెళ్తున్నారు.
తరచూ విశాఖ సందర్శన..
ఉత్తరాంధ్రతో( North Andhra) పాటు విశాఖ విషయంలో చంద్రబాబు గురించి చెప్పనవసరం లేదు. అధికారంలోకి వచ్చింది మొదలు విశాఖ పర్యటనలు చేశారు చాలాసార్లు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సమావేశాలు, పారిశ్రామిక సదస్సులు, పార్టీ కార్యక్రమాలను సైతం విశాఖ వేదికగా నిర్వహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి నెలలో ఒకసారి విశాఖ వెళ్లి వస్తున్నారు. మొన్న ఆ మధ్యన మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. విశాఖ ఎప్పుడు తమ గుండెల్లో ఉంటుందని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే విశాఖకు ఐటి దిగ్గజ సంస్థలను, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను, భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి విశాఖ పై అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభంజనంలో సైతం విశాఖ టిడిపికి అండగా నిలబడింది. అటు రాజకీయంగా పట్టు, 2014 మాదిరిగా విశాఖను పట్టించుకోవడం లేదన్న విమర్శను తిప్పి కొడుతున్నారు.
రుషికొండపై అడుగుపెట్టని జగన్
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) హయాంలో రుషికొండ భవనాలను నిర్మించారు. అవి ప్రభుత్వ పాలన కేంద్రాలుగా చేయడం కోసమే ఆ నిర్మాణాలు అని జగన్ తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల నిర్మాణాలకు సంబంధించిన భవనంలో ఇంతవరకు అడుగు పెట్టలేకపోయారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాత్రం పలుమార్లు ఆ భవనాల సందర్శనకు వెళ్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి.. మూడు రాజధానులు అని ప్రకటించుకున్నారు.. విశాఖను పాలనా రాజధానిగా నిర్ధారించారు. కానీ విశాఖకు వెళ్ళింది తక్కువే. కానీ అమరావతిని ఏకైక రాజధాని చేసి.. విశాఖలో పాలనను చేసి చూపిస్తున్నారు చంద్రబాబు. ఈ విషయంలో ఆ ఇద్దరి నేతల మధ్య తేడా అదే.