TDP: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో భాగంగా టిక్కెట్లు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని వైసిపి ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు వారితో టచ్ లోకి వెళ్లారు. దీంతో వారంతా వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కేఈ ప్రభాకర్, మసాలా పద్మజా, వైకుంఠం మల్లికార్జున, తిక్కారెడ్డి తదితరులు సైకిల్ దిగేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారు పార్టీని వీడకుండా చూసేందుకు టిడిపి సీనియర్లు రంగంలోకి దిగారు. చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.
ప్రధానంగా కేఈ కృష్ణమూర్తి టిడిపిని వీడేందుకు డిసైడ్ అయ్యారు. డోన్ టిక్కెట్ దక్కకపోవడంతో కుమారుడి ఒత్తిడి మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ప్రభాకర్ టిడిపిని వీడకుండా కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేఈ ప్రభాకర్ టిడిపిలో సీనియర్. సోదరుడు కృష్ణమూర్తి తో పాటు పార్టీలో కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికల్లో డోన్ నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి సీట్ల సర్దుబాటులో భాగంగా డోన్ టిక్కెట్ను కోట్ల కుటుంబానికి చంద్రబాబు కేటాయించారు. ఈ నిర్ణయాన్ని సహించలేకపోయిన ప్రభాకర్.. పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. అటు వైసీపీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ ఆఫర్ రావడంతో.. దాదాపు చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. సోదరుడు కృష్ణమూర్తి నిలువరించే ప్రయత్నం చేసిన ఆయన వినలేదని తెలుస్తోంది.
మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో తిక్కా రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు పిలిచి సముదాయించినా ఆయన శాంతించలేదు. మంత్రాలయం టికెట్ పై ఇంకా పట్టు వీడలేదు. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం మల్లికార్జున సైతం వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజా సైతం ఈసారి టిక్కెట్ ఆశించారు. దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఈ నలుగురు నేతలు వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని.. వీరు చేరడం లాంచనమేనని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి కర్నూలు జిల్లా ఆ పార్టీకి అండగా నిలుస్తోంది. గత ఎన్నికల్లో స్వీప్ చేసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడారు. దిగువ స్థాయిలో వైసిపి క్యాడర్ సైతం టిడిపి వైపు వచ్చింది. దీంతో ఇక్కడ వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని.. జనసేనతో పొత్తుతో టిడిపి బలపడిందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఒకేసారి నలుగురు కీలక నేతలు పార్టీని వీడుతుండడం ఇబ్బందికర పరిణామమే. ఒకవేళ కేఈ ప్రభాకర్ కర్నూలు లోక్సభ వైసీపీ అభ్యర్థి అయితే రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.