Golden lizard : శేషాచలం కొండలు ఎర్రచందనం చెట్లకు మాత్రమే కాదు.. విశిష్టమైన జంతుజాలానికి ప్రతీకలు. ఇక్కడ ఆదిమానవుల గుహలనుంచి మొదలుపెడితే నాటి రాజుల పరిపాలన కాలం నాటి కోటల వరకు కనిపిస్తాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ నిత్యం పరిశోధనలు కొనసాగిస్తుంటారు. ముందుగానే చెప్పినట్టు ఇక్కడ అరుదైన జంతువులకు కొదవలేదు. పునుగు పిల్లి నుంచి మొదలు పెడితే నల్ల పులుల వరకు ఇక్కడ ప్రతి జంతువు ప్రత్యేకమే. అయితే ఇటీవల శేషాచలం కొండల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుండగా ఒక బంగారు బల్లి ప్రత్యక్షమైంది.. దీన్ని జంతు శాస్త్ర పరిభాషలో గోల్డెన్ గెకో అని పిలుస్తారు. ఇది సరిసృపాల జాతికి చెందింది. ఈ బల్లికి తక్కువ కాలంలో 40 నుంచి 150 వరకు గుడ్లు పెట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు వంటిపై బంగారపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. చీకట్లో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. చిన్న చిన్న కీటకాలను మాత్రమే కాదు.. మొక్కల ఆకుల్ని కూడా తిని బతకడం ఈ బల్లి ప్రత్యేకత.
అంతరించే స్థాయికి చేరుకుంది
అయితే ఈ బల్లి ప్రస్తుతం అంతరించే స్థాయికి చేరుకుంది.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిపోయిన కాలుష్యం, అడవులలో నివసించేందుకు అనువైన ప్రదేశాలు లేకపోవడంతో ఈ బల్లులు అంతరించే స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది ఈ బల్లులు పాపికొండల అభయారణ్యంలో కనిపించాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ ఇవి దర్శనమిచ్చాయి. సమైక్య జీవనానికి ఈ బల్లులు ప్రతీకగా నిలుస్తాయి. గుడ్లను పెట్టి.. వాటిని పొదిగే ఇవి చాలా దూరం వెళ్తాయి. శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉంటే.. వెంటనే పొదల్లోకి వెళ్తాయి..
ప్రకృతిలో జరిగే మార్పులను గుర్తిస్తాయి
బంగారు బల్లులు ప్రకృతి లో జరిగే మార్పులను వెంటనే గుర్తిస్తాయి. ఇవి పొదల్లోకి వెళితే కచ్చితంగా వర్షాలు కురుస్తాయట. అవి ఎక్కువ కాలం బయట ఉంటే కరువు కాటకాలు ఏర్పడతాయట. ఇది అప్పుడప్పుడు బొరియలు చేసుకొని అందులోకి వెళితే.. భూకంపాల వంటివి సంభవిస్తాయట. పూర్వకాలంలో ఈ బల్లుల గమనం ఆధారంగా వ్యవసాయం చేసే వారట. కాల క్రమంలో ఈ బల్లులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయట. డైనోసార్లు, ఈ బల్లులు ఒకే జాతికి చెందినప్పటికీ.. ఇవి సూక్ష్మ రూపంలో ఉండడం వల్ల.. ఎక్కువ కాలం జీవించాయట. డైనోసార్ల కాలంలో కొన్ని బంగారు బల్లులు దాదాపు కుందేలు పరిమాణం వరకు పెరిగేవట. అప్పట్లో కొంతమంది ఆదిమ జాతులకు చెందిన వాళ్లు ఈ బల్లుల చర్మాన్ని ఔషధాల తయారీలో వినియోగించే వారట.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More