Ginger Price Increase: రాష్ట్రంలో నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో 200 రూపాయల వరకు పలికింది. ఇప్పుడిప్పుడే ధర తగ్గు ముఖం పడుతోంది. అయితే ప్రజలకు ఉపశమనం కలిగే లోపే.. అల్లం ధరల అమాంతం పెరిగాయి. వెల్లుల్లి ధరలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి.దీంతో ప్రజలపై భారం అమాంతం పడుతోంది.
వేసవిలో అకాల వర్షాలు కురవడంతో అప్పట్లో అల్లం, వెల్లుల్లి పంటలను రైతులు కోయలేదు. ఇప్పుడు కోద్దామంటే వానలు పడుతున్నాయి. వర్షాల సమయంలో పంటలు కోస్తే పాడైపోతాయని.. అందుకే రైతులు వేచి చూస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అల్లం, వెల్లుల్లి దిగుబడులు తగ్గడం వల్లే ధర పెరిగిందని చెప్పుకొస్తున్నారు.ప్రస్తుతం కిలో అల్లం 280 రూపాయలకు ఎగబాకగా.. వెల్లుల్లి ధర 200 రూపాయలు వైపు పరుగులు తీస్తోంది.
అల్లం,వెల్లుల్లి విక్రయాలకు విజయవాడ పెట్టింది పేరు. ఇక్కడ నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సప్లై అవుతాయి. కానీ ధరలు చూస్తే భగ్గుమంటున్నాయి. ఏప్రిల్ లో కిలో అల్లం 80 రూపాయలు ఉండగా.. వెల్లుల్లి 50 రూపాయలు పలికింది. మేలో అల్లం 150 కాగా, వెల్లుల్లి 80 కి చేరింది. జూన్లో అల్లం 180, వెల్లుల్లి 120 రూపాయలకు చేరుకుంది. జూలైలో అల్లం 200 ఉండగా.. ప్రస్తుతం 280 రూపాయలకు చేరుకుంది. అటు వెల్లుల్లి సైతం 200 రూపాయలకు ఎగబాకడం విశేషం. అయితే ఇది ఆల్ టైం రికార్డ్ అని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడే వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.