Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu: అంబటికి ఓటు వెయ్యొద్దంటున్న అల్లుడు.. వీడియో వైరల్

Ambati Rambabu: అంబటికి ఓటు వెయ్యొద్దంటున్న అల్లుడు.. వీడియో వైరల్

Ambati Rambabu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసిపి నేతలకు సొంత కుటుంబ సభ్యులే ఎదురు తిరుగుతున్నారు. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కు ఓటు వేయొద్దని.. ఆయన తనయుడు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ వారసుడుగా తనను పక్కనపెట్టి.. కుమార్తెకు మాడుగుల అసెంబ్లీ సీటు ఇవ్వడాన్ని ఆయన కుమారుడు తప్పుపట్టాడు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ముత్యాల నాయుడును చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏకంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అది మరవక ముందే మంత్రి అంబటి రాంబాబుకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. ఆయనకు ఓటు వేయొద్దని కోరుతూ ఏకంగా ఆయన అల్లుడు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది.

మంత్రి అంబటి పై సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. తన మామకు ఓటెయ్యొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డాక్టర్ గౌతమ్ సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఆ వీడియోను టిడిపి ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. తనకు తాను పరిచయం చేసుకుని.. ఏ పరిస్థితుల్లో తాను ఈ వీడియో విడుదల చేయాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు.

” నమస్కారం.. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను మంత్రి అంబటి రాంబాబు అల్లుడిని. అది నా దురదృష్టం.. దానికి ఎవరు ఏమి చేయలేరు. అయితే ఈ వీడియో చేయాలా? వద్దా? అని చాలాసార్లు ఆలోచించి.. చేయడం నా బాధ్యత అనుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. రోజూ పొద్దున్న దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని నా జీవితంలో ఇంకోసారి ఎంటర్ చేయొద్దు స్వామి అని మొక్కుకుంటున్నా. అంత భయంకరమైన వ్యక్తి ఆయన. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే. తాను పోటీ చేయబోయే పోస్టు అలాంటిది. మానవతా విలువలు, మంచితనం, కనీస బాధ్యత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తున్నామంటే మనకు తెలియకుండానే కొన్నింటిని ప్రోత్సహిస్తున్నట్టు. ఇలాంటి వాళ్లను ఓటేస్తే సమాజం తలరాతమారి రేపటి సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీనిని ప్రజలు గమనించి సరైన బాధ్యతతో ఓటు వేసి.. మంచి అభ్యర్థిని ఎన్నుకుంటారని విన్నవిస్తున్నాను’ అంటూ డాక్టర్ గౌతమ్ ఈ వీడియోలో పేర్కొన్నారు.

గత ఐదేళ్ల కాలంలో అంబటి రాంబాబు తీరు వివాదాస్పదంగానే సాగింది. 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు కోడెల శివప్రసాద్ పై గెలిచారు. ఎన్నికల తరువాత వైసిపి ప్రభుత్వ వేధింపులతో కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. అటు తర్వాత మంత్రివర్గ విస్తరణలో అంబటి రాంబాబుకు చోటు దక్కింది. అయినదానికి కాని దానికి రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడడం అంబటి రాంబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే ఓ మహిళతో అనుచిత వ్యాఖ్యల ఆడియో ఒకటి బయటపడింది. జనసేన అధినేత పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో సైతం అంబటి ముందుండేవారు. ఈ క్రమంలోనే బ్రో సినిమాలో ఉంగరాల రాంబాబు పెను వివాదమే సృష్టించింది. అయితే ప్రస్తుతం రెండోసారి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబుకు నరసరావుపేటలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ వీడియో బయటకు రావడం సంచలనం రేపుతోంది. ఎన్నికల్లో ఇది తప్పకుండా ప్రతికూలత చూపుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల ముంగిట వైసీపీ నేతలకు కుటుంబ సభ్యులు షాక్ ఇస్తున్నారు.మొన్న బూడి ముత్యాల నాయుడుకు సన్ స్ట్రోక్ తగిలింది. ఇప్పుడు అంబటికి అల్లుడే చుక్కలు చూపించాడు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular