Garikipati Narasimha Rao: ఢిల్లీ మహారాజు అయినా.. ఒక తల్లికి కుమారుడే. తల్లిదండ్రుల కలలను నిజం చేసేవారు కొందరైతే.. పిల్లలకు మంచి భవిష్యత్తు చూపాలని ఆరాటపడే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అయితే ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆశించినట్లు పిల్లలు జీవితంలో స్థిరపడితే వారి ఆనందానికి అవధులు ఉండవు. అటువంటి భావోద్వేగానికి గురయ్యారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు( Garikapaati Narasimha Rao) , ఆయన కుమారుడు గురజాడ. తాజాగా గరికపాటి నరసింహారావు కుమారుడు గురజాడ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల క్రిందట ఒక ఉద్యోగాన్ని పొందారు గురజాడ. అయితే తన కార్యాలయంలో.. తన కుర్చీలో.. తండ్రిని కూర్చోబెట్టి మురిసిపోయారు గురజాడ. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రి గురించి గొప్పగా రాసుకొచ్చారు.
* ప్రభుత్వ కొలువు సాధించడంతో..
ప్రముఖ ప్రవచనకర్తగా గరికపాటి నరసింహారావు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి సైతం అత్యంత ఇష్టమైన వ్యక్తి. అవధానాలు, టీవీ ఛానల్ లో ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గరికపాటికి ఇద్దరు కుమారులు. వారిద్దరికీ ప్రముఖ కవులు, రచయితల పేర్లు పెట్టుకున్నారు. పెద్ద కుమారుడు పేరు శ్రీశ్రీ కాగా.. చిన్న కుమారుడు పేరు గురజాడ అని పెట్టారు. అందులో చిన్న కుమారుడు గురజాడ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గరికపాటి నరసింహారావుకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఉండేది. అందుకు ప్రయత్నించేసినా వీలు కాలేదు. అయితే ఆయన తనయుడు గరికపాటి గురజాడ మాత్రం ఏపీలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించారు రెండేళ్ల కిందట. అయితే తాజాగా తన తండ్రి గరికపాటి నరసింహారావు కుమారుడు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తన కుర్చీలో కూర్చోబెట్టి మురిసిపోయారు కుమారుడు గురజాడ.
* తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ..
అయితే తన తండ్రి కార్యాలయానికి వచ్చి.. తన కుర్చీలో కూర్చున్న ఫోటోను జతచేస్తూ గురజాడ రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ” నేను ఎంతో కాలంగా ఎదురుచూసిన రోజు. ఇంత కాలానికి వచ్చింది. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు నేను ఎంత తపన పడ్డానో, పడుతున్నానో నాకే తెలుసు. నాన్నగారు ఎంతగానో ఆశపడ్డ ప్రభుత్వ ఉద్యోగం ఆయనకు రాలేదు. అది తెలుగు రాష్ట్రాల అదృష్టం. ఆయనే ఉద్యోగంలో చేరి ఉంటే ఇన్ని ప్రసంగాలు చెప్పేవారు కాదు. కానీ వారసుడిగా ఆయన కన్నా కలను నేను నిజం చేశాను. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో రెండేళ్ల కిందట ఉద్యోగంలో చేరాను. నాన్నగారిని నా కార్యాలయంలో కూర్చోబెట్టే అవకాశం నాకు దొరికింది. ఆయన ఎంతగా మురిసిపోయారు ఆయన నవ్వు చెబుతోంది. నేను ఎంత భావోద్వేగానికి లోనయ్యానో నా కళ్ళు చెబుతున్నాయి. నా ఆనందం పరిమితం. మా ప్రేమ అనంతం”.. అంటూ గరికపాటి గురజాడ ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
