Ganta Srinivasa Rao: వచ్చే ఎన్నికల్లో చాలామంది నేతలు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. వారసులను రంగంలోకి దించనున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే చాలామంది నేతలు తప్పుకున్నారు.. తమ బదులు వారసులను బరిలోకి దించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు తప్పుకునేందుకు ఇప్పటినుంచి ప్రణాళికలు రూపొందించారు. విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు దాదాపు పక్కకు తప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే విశాఖ జిల్లా అంటేనే టిక్కెట్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. అందునా పరిశ్రమలు వచ్చే భీమిలి లాంటి నియోజకవర్గం విషయంలో చాలా పోటీ ఉంటుంది. అనేక రకాలుగా సమీకరణలను పరిగణలోకి తీసుకుంటారు. అందుకే భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు ముందుగానే మేల్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి లైన్ క్లియర్ చేయాలని భావిస్తున్నారు.
అన్ని ఎన్నికల్లో గెలుస్తూ…
1999 నుంచి ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేశారు గంటా శ్రీనివాసరావు. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. వ్యాపార రీత్యా విశాఖకు వచ్చి రాజకీయంగా సక్సెస్ అయ్యారు. తరచూ నియోజకవర్గాలను మార్చుతూ గెలుస్తూ వచ్చారు. టిడిపి నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడినుంచి టిడిపిలోకి వచ్చారు. అయితే 2014 వరకు మంత్రిగా వ్యవహరించిన ఆయన ఆ ఎన్నికల్లో టిడిపి వైపు వచ్చారు. భీమిలి నుంచి పోటీ చేసి గెలవడంతో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ టిడిపి అధికారంలోకి రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి మరోసారి పోటీ చేసి గెలిచారు. కానీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు.
కీలకంగా భీమిలి నియోజకవర్గం..
ప్రస్తుతం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖకు క్యూ కడుతున్నాయి. ఆ పరిశ్రమలన్నీ భీమిలి నియోజకవర్గంలోనే ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో భీమిలి నియోజకవర్గం ఎంతగానో గుర్తింపు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు గంటా రవితేజను అక్కడ పోటీ పెట్టాలని చూస్తున్నారు శ్రీనివాసరావు. మరోవైపు ఇక్కడ టికెట్ కోసం చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు లైన్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పటికీ తన కుమారుడిని లోకేష్ టీమ్ లో పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కూడా చేస్తున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తుండడంతో భీమిలి నియోజకవర్గాన్ని తన కొడుకుకు అప్పగించేందుకే అన్న టాక్ నడుస్తోంది.