Galla Jaidev Rejoin TDP: గల్లా జయదేవ్( Galla Jaidev ) పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ నిన్ననే ప్రారంభం అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పార్టీ గల్లా జయదేవ్ వేదిక పంచుకున్నారు. గత కొంతకాలంగా జయదేవ్ వారితో కనిపించడం అరుదు. ఇప్పుడు కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో జయదేవ్ పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది. మొన్న ఆ మధ్యన కాణిపాకం సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జయదేవ్ తన పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడారు. అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేష్ తో ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జయదేవ్ తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారన్న బలమైన చర్చ ఇప్పుడు జరుగుతోంది.
Also Read: భారతదేశంలో అత్యంత సంపన్న జిల్లాలు: మన రంగారెడ్డి నంబర్ 1
రాజకీయాల్లో ప్రత్యేక స్థానం..
ఉమ్మడి ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో గల్లా కుటుంబానిది ప్రత్యేక స్థానం. అమర్ రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేతగా గల్లా రామచంద్ర నాయుడు ఉండేవారు. ఆయన భార్య గల్లా అరుణకుమారి. ఆమె తండ్రి మంచి రాజకీయవేత్త. ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు అరుణకుమారి. 2004లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజశేఖరరెడ్డి. 2009లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు కూడా ఏపీ క్యాబినెట్లో ఆమెకు స్థానం దక్కింది. అయితే 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అరుణకుమారి. ఆ సమయంలో ఆమెతో పాటు కుమారుడు గల్లా జయదేవ్ సైతం తెలుగుదేశం పార్టీలో చేరారు.
తల్లి తో పాటు టిడిపిలోకి
2014 ఎన్నికల్లో చంద్రగిరి( Chandragiri) నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గల్లా జయదేవ్ టిడిపి అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే గల్లా అరుణ్ కుమారి ఓడిపోయారు. జయదేవ్ మాత్రం గెలిచారు. మంచి వాగ్దాటి, చురుకైన పాత్రతో లోక్సభలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు జయదేవ్. 2019లో రెండోసారి గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు. జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకొని ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019- 2024 మధ్య తెలుగుదేశం పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించారు. ఈ పరిణామ క్రమంలో ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. పారిశ్రామిక కుటుంబం కావడంతో ప్రభుత్వాల నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 2024 ఎన్నికల కు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన స్థానంలో మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు పార్లమెంటు టికెట్ ను దక్కించుకున్నారు. ఎంపీగా గెలవడంతో పాటు కేంద్ర క్యాబినెట్లో సైతం ఆయనను తీసుకున్నారు. అలా కేంద్రమంత్రి అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు గల్లా జయదేవ్.
Also Read: : 21 ఏళ్లకే సీఎం..? ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు
టిడిపి పెద్దలతో సంబంధాలు..
అయితే తెలుగుదేశం( Telugu Desam) పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు జయదేవ్. ఈ క్రమంలో ఆయనకు ప్రాధాన్యత పదవి ఇస్తారని అంతా భావించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తారని అంచనా వేశారు. కానీ చంద్రబాబు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఆ పదవిలో కూర్చోబెట్టారు. అటు తర్వాత గల్లా జయదేవ్ పెద్దగా కనిపించలేదు. అయితే మొన్న ఆ మధ్యన కాణిపాకం ఆలయ సందర్శన సమయంలో పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందని.. రాజ్యసభ పదవి సైతం ఇస్తారని చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబుతో ఆయన వేదిక పంచుకున్నారు. దీంతో జయదేవ్ కు లైన్ క్లియర్ అయినట్లు అయింది. త్వరలో ఆయన టిడిపిలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెగ ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.