Gali Janardhan Reddy: ఎట్టకేలకు గాలి జనార్దన్ రెడ్డికి( Gali Janardan Reddy) శిక్ష పడింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధిపతిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ తరుణంలో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారించిన.. నాటి సిపిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ తన అనుభవాలను పంచుకున్నారు. కేసు విచారణకు సంబంధించిన కీలక విషయాలను ఓ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన చెప్పిన మాదిరిగా గాలి జనార్ధన రెడ్డి అంత ఈజీగా తమకు దొరకలేదని వివరించారు. ఆయన అరెస్టు జరగకుండా అప్పట్లో అనేక వ్యవస్థలు తమపై ఒత్తిడి పెంచిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఓబుళాపురం మైనింగ్ విషయంలో నమోదైన కేసుకు సంబంధించి విచారణ అధికారిగా.. వివి లక్ష్మీనారాయణ అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే దేశవ్యాప్తంగా ప్రముఖుల కేసులను లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు కూడా విచారించింది ఆయనే.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే?
* విచారణలో సంక్లిష్టత..
యూపీఏ ప్రభుత్వ( UPA government ) హయాంలో ఓబులాపురం మైనింగ్ పై దర్యాప్తు జరిగింది. అయితే అసలు ఎటు నుంచి విచారణ చేపట్టాలో తెలియలేదని లక్ష్మీనారాయణ చెప్పారు. దీనిని ఛేదించేందుకు చాలా సమయం పట్టిందన్నారు. కొన్ని కీలక వ్యవస్థలు గాలి జనార్దన్ రెడ్డి వెనుక ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ మైనింగ్ రెండు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉంది. రెండు రాష్ట్రాల అధికారులు సహకరించడంలో మొండి చేయి చూపారు. కీలక అధికారులు విచారణకు వస్తున్నామని చెప్పి సెలవులపై వెళ్లిపోయే వారిని గుర్తు చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నామని వివి లక్ష్మీనారాయణ చెబుతున్నారు.
* గోప్యతగా అరెస్ట్..
అయితే గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు సమయంలో అనేక రకాల పరిణామాలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. సిబిఐ అధికారులమని చెబితే గాలి జనార్దన్ రెడ్డి మనుషులు అడ్డుకుంటారని భావించి.. ఐటి అధికారులమని చెప్పి.. తనిఖీల కోసమని లోపలికి ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అత్యంత గోప్యంగా ఆయనను అరెస్టు చేశామని.. ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డామన్నారు. మా ఫోన్లను సైతం పక్కన పెట్టేసామన్నారు. అరెస్టు తరువాత మాకు బెదిరింపులు వస్తాయని కొందరు భయపెట్టారని.. కానీ వాటిని లెక్క చేయలేదన్నారు. పక్కా ఆధారాలతో కేసును ఫైల్ చేసాం అని వివరించారు. ఈ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు సాగాయని కూడా జేడీ వివరించారు. తమ చేతిలోని అధికారులను బదిలీ చేయించేవారు అని.. ఈరోజు ఉండే అధికారి.. రేపటికి ఉండేవారు కాదని చెప్పారు. సుమారు 14 సంవత్సరాల పాటు కేసు విచారణలో జాప్యం జరగడానికి రాజకీయపరమైన బదిలీలు కారణమని కూడా చెప్పుకున్నారు. అయితే ఇటువంటి కేసుల విషయంలో సత్వర పరిష్కార మార్గాలు చూపించేందుకు.. త్వరితగతిన విచారణ పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు జేడీ లక్ష్మీనారాయణ.