Jagan: ఉత్తరాంధ్ర పై జగన్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ పార్టీని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలో దారుణంగా దెబ్బతింది. 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. శ్రీకాకుళం తో పాటు విజయనగరంలో కూటమి స్వీప్ చేసింది. ఇక్కడ వైసిపి బోణీ తెరవలేదు. విశాఖ జిల్లాలో మాత్రం అరకు, పాడేరు ఎస్టి రిజర్వుడ్ నియోజకవర్గాలను గెలుచుకుంది. అయితే 2019లో జగన్ ప్రభంజనంలో సైతం టిడిపి ఆరు స్థానాల్లో గెలిచింది. విశాఖ నగరంలోని నాలుగు సీట్లతో పాటు శ్రీకాకుళం జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. కానీ వైసీపీకి మాత్రం ఈ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా ఉత్తరాంధ్రలో చోటు దక్కలేదు. దీంతో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
* పాలనా రాజధానిగా ప్రకటించినా
ఉత్తరాంధ్రలోని విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు జగన్. దీంతో ఉత్తరాంధ్రలో ఏకపక్ష విజయం దక్కుతుందని భావించారు. అయితే విశాఖ రాజధానిని విశ్వసించలేదు ఉత్తరాంధ్ర ప్రజలు. కనీసం విశాఖ నగరంలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు స్థానికులు. కనీసం వైసీపీని పార్టీగా కూడా గుర్తించలేదు. భారీ మెజారిటీలతో కూటమికి జై కొట్టారు ప్రజలు. ఈ తరుణంలో జగన్ చాలా రకాల మనస్థాపానికి గురయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తాను రాజధానిగా ప్రకటించినట్లు చెప్పినా.. పెద్దగా ఆహ్వానించకపోవడంతో జగన్ లో ఒక రకమైన ఆవేదన వ్యక్తం అయ్యింది. అందుకే ఈ అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని.. పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు జగన్.
* శ్రీకాకుళం నుంచే
జనవరి మూడో వారంలో జగన్ జనంలోకి రానున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం రెండు రోజులపాటు ఒక జిల్లాలో ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనకు సంబంధించి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డారు. జగన్ క్షేత్రస్థాయి పర్యటనలను శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో ఏ కార్యక్రమం తలపెట్టిన సక్సెస్ అవుతుందన్న సెంటిమెంట్ కొనసాగుతోంది. దీంతో జగన్ శ్రీకాకుళం జిల్లా నుంచి తన జిల్లా పర్యటనలు మొదలు పెడతారని తెలుస్తోంది. మొత్తానికి అయితే ఉత్తరాంధ్ర పై పట్టు కోసం జగన్ ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించడం విశేషం.