Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సమీక్షించారు. కీలక నిర్ణయాలను సైతం ప్రకటించారు. అయితే విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రైతులందరికీ ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని డిసైడ్ అయ్యారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* సీఎం సమీక్ష..
విమానాశ్రయ ప్రారంభోత్సవం పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విమానాశ్రయం కోసం తమ స్థలాలను, పంట పొలాలను త్యాగం చేసిన రైతులకు ఒకసారి ఉచితంగా విమాన ప్రయాణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణంలో రైతుల పాత్ర అత్యంత కీలకమని.. వారి త్యాగాన్ని ప్రభుత్వం ఎప్పటికీ మరువదని చెప్పారు. ప్రారంభోత్సవం రోజున ఉత్తరాంధ్రలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనస్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు.
* ఉత్తరాంధ్ర సంప్రదాయాలతో..
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి పీ ఎం ఓ వర్గాల నుంచి ఇంకా షెడ్యూల్ రాలేదు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అల్లూరి సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అవుతుండడంతో.. స్థానిక గిరిజన, జానపద నృత్య సంప్రదాయ ప్రదర్శనలతో ప్రధానిని ఆహ్వానం పలికేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయ ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ ఉండనుంది. భారీగా జన సమీకరణ చేసేందుకు కూడా నిర్ణయించారు. మరోవైపు కేంద్ర బలగాలు కూడా భారీగా మోహరించనున్నాయి. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.


