AP Cabinet: ఏపీ క్యాబినెట్ నుంచి నలుగురు మంత్రుల ఉద్వాసన తప్పదా? అందులో ఒక జనసేన మంత్రి ఉన్నారా? నాగబాబు తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎంట్రీ ఇవ్వనున్నారా? వీరిద్దరితో పాటు మరో బిజెపి నేతకు చాన్స్ దక్కనుందా? ఇలా రకరకాల ప్రచారం నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే పాలన కుదుటపడుతోంది. మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మంత్రుల తొలగింపు ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులతో పాటు బిజెపికి ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. ఇప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయనున్నారు. అయితే ఒక్క నాగబాబు కాదు… ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది.
* పదిమంది కొత్తవారికి పదవులు
గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పదిమందికి మంత్రి పదవులు ఇచ్చారు. మూడు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే చంద్రబాబు కీలక హెచ్చరికలు చేశారు. పనితీరు బాగా లేకుంటే మార్చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఒకరిద్దరు మంత్రుల వ్యవహార శైలి పై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రుల ఉద్వాసన ఉంటుందని ఒక ప్రచారం బలంగా నడుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా పూర్తికాలేదు. కనీసం ఏడాది సమయం ఇవ్వకుండా మంత్రి పదవులు నుంచి తొలగిస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.అయితే అది ఫేక్ న్యూస్ గా ఎక్కువమంది తేల్చి చెబుతున్నారు.
* నాగబాబు కు మంత్రి పదవి ఎప్పుడో?
ఏపీ క్యాబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నా అటువంటి కసరత్తులు ఏమీ జరగడం లేదు. ప్రస్తుతం నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కాదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే కచ్చితంగా ఆరు నెలల్లోగా చట్టసభలకు ఎన్నిక కావాలి. అయితే పవన్ కళ్యాణ్ అభిప్రాయం వేరేలా ఉందట. నాగబాబును ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. అదే జరిగితే నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం అవ్వక మానదు. ఈ లెక్కన మార్చి తరువాతే నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది జరగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నలుగురు మంత్రుల ఉద్వాసన అనేది ఫేక్ న్యూస్ గా అభివర్ణిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.