Kesineni Nani: ఎన్నికల్లో రాజకీయ దురదృష్టవంతులుగా మిగిలిన నేతలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన నేతల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. టిడిపి, జనసేనల నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్లిపోయారు. పార్టీ నాయకత్వంపై రకరకాల ఆరోపణలు చేసి వైసీపీలో చేరారు. అటువంటి నాయకులంతా ఇప్పుడు తెగ బాధపడుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి పై పోరాటం చేసి.. చివరిగా ఆ పార్టీలో చేరి తప్పు చేశామన్న బాధ వారిని వెంటాడుతోంది. అందుకే చాలామంది రాజకీయాల నుంచి నిష్క్రమించాలని డిసైడ్ అయ్యారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజుతో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని సంచలన ప్రకటన చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు నాని. రెండుసార్లు గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ సొంత తమ్ముడు చిన్ని చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలకు ముందు జనసేన నుంచి చాలామంది బయటకు వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ అధినేతపై అనేక రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకరు విజయవాడకు చెందిన పోతిన మహేష్. 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహేష్. అయినా సరే పవన్ మహేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన రాష్ట్ర నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. అయితేవిజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడంతో.. మనస్థాపానికి గురైన పోతిన మహేష్ పార్టీకి దూరమయ్యారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను జనసేన ను వీడితే కొబ్బరి బొండాల కత్తితో తెగ నరకాలని అంతకుముందు మహేష్ వ్యాఖ్యానించారు. కానీ ఈ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మహేష్ పవన్ ను అనరాని మాటలు అన్నారు. అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వైసీపీ ఓటమి, కూటమి ఘనవిజయంతో మదన పడుతున్నారు.
ముద్రగడ పద్మనాభం గురించి చెప్పనవసరం లేదు. రాజకీయంగా తటస్థంగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అంతకంటే ముందే జనసేనలో చేరాలని భావించినా.. పవన్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ కోపంతో వైసీపీలో చేరిన ముద్రగడ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని సవాల్ చేశారు. అక్కడ పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని కూడా శపధం చేశారు. ఇప్పుడు వైసీపీ ఓటమితో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఆత్మాభిమానంతో తన పేరును మార్చుకునేందుకు గెజిట్ కు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ముద్రగడ మాదిరిగా చాలామంది రాజకీయ దురదృష్టవంతులు ఉన్నారు. క్షణికావేశంతో, జగన్ పై అపార నమ్మకంతో, తమ తప్పును వెనక్కి తీసుకోలేనంతగా ప్రవర్తించారు. ఇప్పుడు వైసీపీ ఓటమితో మూల్యం చెల్లించుకుంటున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Former vijayawada mp keshineni nani has announced his political asceticism
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com