CM Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. టిక్కెట్లు దక్కని నేతలు పక్క పార్టీల్లో చేరుతున్నారు. అటు రాజకీయ పార్టీలు సైతం వ్యూహాలు మార్చుతున్నాయి. పార్టీల్లో చేరుతున్న కొత్త ముఖాలకు అనూహ్యంగా టిక్కెట్లు కట్టబెడుతున్నాయి. తాజాగా వైసీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నానిని జగన్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపిలో ఉన్న ఈలి నాని గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీనిని గమనించిన వైసీపీ కీలక నేతలు ఆయనతో చర్చలు జరిపారు. తాడేపల్లిగూడెం టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన్ను ప్రత్యేకంగా పార్టీలోకి రప్పించినట్లు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బిజెపికి ఆ స్థానం దక్కింది. మాణిక్యాలరావు అక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పటి పరిస్థితులను అంచనా వేసి ఇప్పుడు ముందుగా జనసేనకు ఆ సీటు కేటాయించారు. అక్కడ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ కు జనసేన అభ్యర్థిగా పవన్ ఖరారు చేశారు. ఆయన బలమైన అభ్యర్థి. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ ఉన్నారు. ఆయన గ్రాఫ్ బాగాలేదని తేలింది. అందుకే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈలి నానికి పార్టీలోకి రప్పించారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఈలి నాని పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం ఇన్చార్జిగా ఉండేవారు. కానీ ఇటీవల హై కమాండ్ ఆయన తప్పించింది. వలవల బాబ్జిని ఇన్చార్జిగా నియమించింది. దీంతో అప్పటినుంచి మనస్థాపంతో ఉన్నారు. అయితే ఈ సీటును జనసేనకు కేటాయించడంతో.. బలమైన అభ్యర్థి అవసరమని జగన్ భావించారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ను తప్పించి.. ఈలి నానికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొట్టు సత్యనారాయణ ఎలా ముందుకెళ్తారో చూడాలి.