Mekathoti Sucheritha : వైసిపికి చాలామంది సీనియర్లు గుడ్ బై చెబుతున్నారు. తాము ఇక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అక్కడకు కొద్ది రోజులకే వేరే పార్టీల్లో చేరుతున్నారు. చాలామంది నేతల తీరు ఇలానే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత. కొద్ది రోజుల కిందటే అధినేతను కలిశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అంతా నిజమేనని నమ్మారు. కానీ ఆమె ఏదో ఒక పార్టీలో చేరుతారని తాజాగా ప్రచారం ప్రారంభమైంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆయన సైతం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి ముందుగా రాజీనామా చేశారు. తరువాత ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేకతోటి సుచరిత సైతం అదే మాదిరిగా నిర్ణయం తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. గత రెండు రోజులుగా ఈ టాక్ మరింత పెరిగింది.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు మేకతోటి సుచరిత. 2009లో తొలిసారిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంటే అడుగులు వేశారు సుచరిత. 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయినా సరే వైసీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్ తన క్యాబినెట్లోకి మేకతోటి సుచరితను తీసుకున్నారు. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఏకంగా హోం శాఖను ఆమెకు అప్పగించారు. దీంతో వైసీపీలో ఒక రకమైన విస్మయం వ్యక్తం అయింది. ఆమెకు హోం మంత్రి పదవా అంటూ ఎక్కువమంది ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు. అయితే హోం మంత్రిగా ఉన్నారే తప్ప ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అన్న కామెంట్స్ ఆమెపై వినిపించాయి. ఆమెను డమ్మీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
* తాజా పరిణామాలతో
అయితే మంత్రివర్గ విస్తరణలో మేకతోటి సుచరితను తొలగించారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది మంత్రులను మార్చారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బాహటంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. పార్టీని వీడుతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే అంతటి సాహసం చేయలేదు. అసంతృప్తితోనే పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడుతారని తెగ ప్రచారం నడిచింది. అయితే ఆమె భర్తకు బాపట్ల ఎంపీ సీటు ఇస్తారని జగన్ ఆఫర్ చేశారు. కానీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సుచరితకు సైతం సొంత నియోజకవర్గం ప్రతిపాడు సీటు దక్కలేదు. ఆమెను తాడికొండ నుంచి పోటీ చేయించారు. దీంతో ఘోర పరాజయం ఎదురైంది. అప్పటినుంచి తీవ్ర మనస్థాపంతో గడుపుతున్నారు సుచరిత. మరోవైపు తాడికొండకు కొత్త వ్యక్తిని ఇన్చార్జిగా నియమించారు జగన్. అటు ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు కూడా వేరొకరికి అప్పగించారు. దీంతో సుచరిత పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. టిడిపిలో కానీ, జనసేనలో కానీ చేరతారని ప్రచారం నడుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.