Former minister Jogi Ramesh: మాజీమంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh )అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ చేశారా? దీపావళి ముగిసిన మరుక్షణం ఆయన అరెస్టు తప్పదా? ఈ మేరకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందా? జోగి రమేష్ ను అరెస్టు చేయడం ద్వారా వైసీపీని ఇరుకున పెట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై జోగి రమేష్ కుట్ర చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడి వాంగ్మూలంతో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. తద్వారా వైసిపి నేతల దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్వరంలో మార్పు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ స్వరంలో మార్పు వచ్చింది. ఒకానొక దశలో చంద్రబాబు విషయంలో తాము వ్యవహరించింది తప్పు అని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. టిడిపి ప్రజాప్రతినిధులతో వేదిక పంచుకోవడం ద్వారా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చాలా రెచ్చిపోయారు. ఏకంగా చంద్రబాబు ఇంటి పై దండయాత్ర చేశారు. దానిని మరిచిపోలేదు టిడిపి శ్రేణులు. అందుకే జోగి రమేష్ ప్రయత్నాలన్నీ నిలిచిపోయాయి. అయితే అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా మారింది. జోగి రమేష్ విషయంలో జగన్మోహన్ రెడ్డి సైతం ఆగ్రహంగా ఉండేవారట. అందుకే ఆయనను చల్లబరిచేందుకు ఈ నకిలీ మద్యం డ్రామాకు తెర తీశారు. కానీ అందులో కూడా అడ్డంగా బుక్కయ్యారు.
బయట పెట్టేసిన ప్రధాన నిందితుడు
అద్దేపల్లి జనార్దన్ రావు తనకు ఎంతో సన్నిహితుడు అన్న జోగి రమేష్ పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం డంపు దొరికిన తర్వాత జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో యాక్షన్ లోకి దిగారు. ప్రభుత్వ పెద్దలే నకిలీ మద్యం చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే అద్దేపల్లి జనార్దన్ రావుకు విజయవాడలో మూలాలు ఉండడం, ఆయన జోగి రమేష్ కు సన్నిహితుడని టిడిపి నేతలు గుర్తించగలిగారు. అక్కడికి కొద్ది రోజులకే జనార్దన్ రావు విదేశాల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే జనార్దన్ రావు జోగి రమేష్ పై విరుచుకుపడ్డారు. తనను అడ్డంగా బుక్ చేయడంపై జోగి రమేష్ పేరును బయట పెట్టేశారు. అయితే ఒక్క జోగి రమేష్ మాత్రమే ఉన్నారా? ఇంకా వైసీపీ నేతల హస్తం ఉందా? కూటమి నేతలను ప్రలోభ పెట్టారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే దీపావళి ముగిసిన మరుక్షణం జోగి రమేష్ అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.