Telangana Police neutralized Riaz : ఇటీవల నిజాంబాద్ జిల్లాలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అనేక కేసులలో నిందితుడు.. కరుడుగట్టిన నేరగాడు రియాజ్ ను కానిస్టేబుల్ ప్రమోద్ తన బైక్ మీద విచారణ నిమిత్తం తీసుకెళ్తుండగా.. ఉన్నట్టుండి పదునైన కత్తితో ప్రమోద్ పై అతడు దాడి చేశాడు. చాతి భాగంలో అనేక పర్యాయాలు గాయాలు చేశాడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మొత్తం సభ్య సమాజం చూస్తుండగానే జరిగింది. అయినప్పటికీ కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం నుంచి అధికంగా రక్త స్రావం జరిగింది.
తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందిన అతడు కన్నుమూశాడు. వాస్తవానికి స్థానికులు గనక సకాలంలో స్పందించి ఉంటే.. రియాజ్ ను అడ్డుకొని ఉంటే అతడి ప్రాణాలు నిలబడేవి.. కానీ స్థానికులు ఎవరూ స్పందించకపోవడంతో రియాజ్ రెచ్చిపోయాడు. ప్రమోద్ ప్రతిఘటిస్తున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా కత్తితో పోట్లు పొడిచాడు. చాతి భాగంలో పొడవడంతో అతడి అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమోద్ చనిపోయిన తర్వాత జిల్లా కమిషనర్ పోలీస్ సాయి చైతన్య కన్నీటి పర్యంతమయ్యారు. సభ్య సమాజంపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు.. చివరికి వారి ప్రాణాలను కూడా సమాజం కోసం త్యాగం చేయాల్సి రావటం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన విచారణను వేగవంతం చేశారు. ప్రమోద్ అంత్యక్రియలలో పాల్గొని.. వారి కుటుంబానికి భరోసా కల్పించారు. కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ప్రమోద్ అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత పోలీసులు రియాజ్ కోసం వేట మొదలుపెట్టారు.. అతడిని ఓ ప్రాంతంలో గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ప్రమోద్ పై దాడి చేస్తున్నప్పుడు రియాజ్ కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అతడిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్ అక్కడికక్కడే చనిపోయాడు. రియాజ్ మీద దాదాపు 60 కి పైగా కేసులు ఉన్నాయి. రియాజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అతడు పారిపోకుండా ఉండడానికి పోలీస్ శాఖ కొంతమంది సిబ్బందిని రక్షణగా ఉంచింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు పారిపోవడానికి ప్రయత్నించి పక్కనున్న కానిస్టేబుల్ తుపాకీని లాక్కోవడానికి యత్నించాడు. ప్రమోద్ పై మాదిరిగా దాడికి పాల్పడతాడని భావించిన పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారు. రియాజ్ అక్కడికక్కడే చనిపోయాడు.