Anil Kumar Yadav: గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కనిపించడం లేదు. అడపాదడపా తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించిన ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నైలో వ్యాపారాల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.దీంతో ఆయన పార్టీకి దూరమవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. నెల్లూరు సిటీకి వస్తున్న ఆయన సీక్రెట్ గా తన పనులు ముగించుకుని వెళ్తున్నారు.ఈ క్రమంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్లారిటీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్.జగన్ కు అత్యంత విధేయుడుగా మెలిగారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే కొనసాగుతున్నారు అనిల్ కుమార్ యాదవ్. జగన్ పై విమర్శలు వస్తే తక్షణం స్పందించే గుణం ఆయనది. ఆ దూకుడు తనం చూసి జగన్ నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ ను గెలిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మాత్రం నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటు ఇవ్వలేదు. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పంపించారు. కానీ అక్కడ ఓటమి ఎదురయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి డల్ అయ్యారు అనిల్. అయితే తనపై జరుగుతున్న ప్రచారం విషయంలో తాజాగా ఆయన స్పందించారు.
* ఆయన తీరుతోనే
నెల్లూరు జిల్లాలో ఈసారి వైసిపి తుడుచుపెట్టుకుపోయింది. ఒక్క సీటు కూడా పార్టీకి దక్కలేదు. 2014, 2019 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఏకపక్ష విజయం దక్కించుకుంది వైసిపి. ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బలమైన నేతలుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు బయటకు వెళ్లిపోయారు. అయితే నెల్లూరులో పార్టీ ఓటమికి అనిల్ కుమార్ యాదవ్ తీరు కారణమని ఆరోపణలు వచ్చాయి. అందుకే జగన్ సైతం అనిల్ కుమార్ యాదవ్ ను దూరం పెట్టారని ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే అనిల్ పెద్దగా కనిపించలేదు. ఈ తరుణంలో పార్టీ మారుతారని ప్రచారం సాగింది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది.
* త్వరలో యాక్టివ్ అవుతా
త్వరలో నెల్లూరు జిల్లాలో యాక్టివ్ రాజకీయాలు చేయనున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. పాత కేసుల్లో తనను అరెస్ట్ చేయాలంటూ కొందరు నేతలు లోకేష్ వెంట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భరిస్తానని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తానంటూ హెచ్చరించారు. అరెస్టులపై కూటమి నేతలు ఒక దారి చూపించారని.. రానున్న కాలంలో తప్పకుండా వారికి ఇదే సిక్సలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు అనిల్. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.