Jaradoddi Sudhakar: బాలికపై లైంగిక వేధింపులతో దారుణం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి.

Written By: Dharma, Updated On : July 4, 2024 5:36 pm

Jaradoddi Sudhakar

Follow us on

Jaradoddi Sudhakar: ఏపీలో వైసీపీ నాయకుల అరెస్ట్ కొనసాగుతోంది. పోలింగ్ నాడు జరిగిన విధ్వంసాలకు బాధ్యుడును చేస్తూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు ఆయనను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. రాష్ట్రంలో రాజకీయ కక్షపూరిత కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇటువంటివి మానుకోవాలని చంద్రబాబు సర్కార్ కు గట్టి హెచ్చరికలు అంటారు. ఇలా జగన్ హెచ్చరించారో లేదో.. మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సుధాకర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గురువారం కర్నూలులోని తన నివాసంలో సుధాకర్ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలపై పాత కేసులు తిరగతోడే పనిలో పడ్డారు పోలీసులు. 2019 ఎన్నికల్లో కోడుమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు సుధాకర్. ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ దక్కలేదు. బాలికపై లైంగిక ఆరోపణలతోనే ఆయనకు టికెట్ దక్కలేదన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా అరెస్టు చేయడం విశేషం.

స్వతహాగా డాక్టర్ అయిన సుధాకర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో మహిళా సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు కేసు నమోదు చేయలేదని విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో కదలిక వచ్చింది. జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని పరామర్శించే క్రమంలో చంద్రబాబు సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. హెచ్చరించినంత పని చేశారు. ఇంతలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.