Ambati Rayudu: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపుతో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి విజయసాయిరెడ్డి షాక్ ఇచ్చారు. ఆయన రాజకీయాలనుంచి నిష్క్రమణ వెనుక అనేక రకాల చర్చ నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు క్రికెటర్ అంబటి రాయుడు. మొన్నటి ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపైనర్ గా పనిచేశారు రాయుడు. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. బిజెపితో పాటు అనుబంధ సంస్థల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అంబటి రాయుడు. దీంతో ఆయన బిజెపిలో చేరవచ్చు అన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కు షాక్ తప్పేలా లేదు.
* తొలుత వైసిపి వైపు
క్రికెట్ కెరీర్ ను కొనసాగిస్తూ వస్తున్న అంబటి రాయుడు గత వైసిపి ప్రభుత్వ హయాంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో అంబటి రాయుడును స్వయంగా పిలిపించుకున్న జగన్ అభినందనలు తెలిపారు. వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పి వైసిపి కండువా కప్పుకున్నారు అంబటి రాయుడు. కానీ ఇలా వైసీపీకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. వైసీపీలో ఉండలేనని తేల్చి చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ ను కలిసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పవన్ నాయకత్వంలో పనిచేయాలని ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన పవన్.. అంబటి రాయుడు సేవలను వినియోగించుకుంటామని చెప్పారు.
* జనసేన స్టార్ క్యాంపెయినర్ గా
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపెయినర్ గా అంబటి రాయుడు ను నియమించారు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బిజెపి కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతున్నారు . విశాఖలో జరిగిన ఏబీవీపీ కార్యక్రమంలో అంబటి రాయుడు పాల్గొన్నారు. బిజెపి పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బిజెపి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అంబటి రాయుడు బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు బిజెపిలో కొనసాగుతున్నారు. వారి సూచన మేరకు అంబటి రాయుడు సైతం బిజెపిలో చేరతారని ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.