Flash Flood Warning To AP: ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు( heavy rain) నమోదు అవుతున్నాయి. రాబోయే 24 గంటల్లో కొన్ని జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, యానం ప్రాంతాలకు ఆకస్మిక వరదలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది.
లోతట్టు ప్రాంతాల్లో చర్యలు..
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టారు అధికారులు. ప్రజలను పెద్ద ఎత్తున అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు వివిధ శాఖల ఉన్నతాధికారుల సెలవులను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం( AP government). వర్షాలు,వరదలకు సంబంధించి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఏపీలో అల్పపీడనం కారణంగా వారం రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర- ఒడిస్సా వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది.
Also Read: చూస్తుండగానే.. రాయలసీమ రతనాలసీమగా మారిపోయింది.. ఆ పని చేస్తే చంద్రబాబుకు శాశ్వత కీర్తి?
ఉత్తరాంధ్రకు హెచ్చరిక..
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. శ్రీకాకుళం( Srikakulam ), విజయనగరం, నంద్యాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. కోస్తాంధ్రలో వారం రోజులపాటు వర్షాలు కొనసాగుతాయి. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22 సెంటీమీటర్లు, ముమ్మిడివరంలో 18 సెంటీమీటర్లు, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల నేపథ్యంలో కలింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఎగురవేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో,అవుట్ ఫ్లో 5.46 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.