https://oktelugu.com/

Vishakha YCP: విశాఖలో గేట్లు ఎత్తేశారుగా.. కూటమి పార్టీలోకి భారీ చేరికలు.. జనసేనలోకి ఐదుగురు కార్పొరేటర్లు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు అవుతోంది. 164 అసెంబ్లీ స్థానాలతో ఘన విజయం సాధించింది కూటమి. దీంతో వైసిపి కుదేలైంది. ఆ పార్టీ నుంచి చేరికలు పెరుగుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : August 7, 2024 / 10:02 AM IST

    Vishakha ycp

    Follow us on

    Vishakha ycp: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడిప్పుడే వైసిపి కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే పార్టీ శ్రేణులు గాడిలో పడుతున్నాయి. అయితే ఓటమి మాత్రం నేతల్లో నైరాశ్యం పెంచింది. కోలుకొని పూర్వవైభవం సాధిస్తుందని ఎక్కువమంది భావించడం లేదు. అధినేత జగన్ వైఖరి భిన్నంగా ఉండడమే అందుకు కారణం. పైగా జాతీయస్థాయి రాజకీయాలు ఏపీపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే పార్టీలో ఉండడం కంటే.. వేరే పార్టీలో చేరడం ఉత్తమమని చాలామంది ఒక నిర్ణయానికి వస్తున్నారు. అధికార పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ పార్టీలో చేరిపోతున్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు విజయం సాధించింది వైసిపి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయ్యింది. క్యాడర్ కు ఊహించని పరాజయం ఎదురు కావడంతో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం వైసీపీని వీడెందుకు సిద్ధపడుతున్నారు. పెద్ద నేతలు సైతం ఇప్పటికే పార్టీని వీడెందుకుసిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కిలారి రోశయ్య, మద్దాలి గిరి వైసిపికి రాజీనామా ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు సైతం పార్టీని వీడారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారు. ఆయన కుమారుడును టిడిపిలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలామంది వైసీపీ సీనియర్లు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు.

    * చేరికల విషయంలో జాగ్రత్తలు
    అయితే వైసీపీ నుంచి చేరికల విషయంలో కూటమి పార్టీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నాయి. గత ఐదేళ్లుగా వైసిపి హయాంలో ఇబ్బంది పెట్టిన నేతలను చేర్చుకోకూడదని భావించాయి.కానీ విశాఖ జిల్లాలో ఎన్నికల దృష్ట్యా స్థానిక వైసిపి ప్రజాప్రతినిధులను కూటమి పార్టీల్లోకి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. అందులో భాగంగా విశాఖ నగరపాలక సంస్థలో ఐదుగురు వైసిపి కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఇప్పటికే 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడారు. ఈ ఐదుగురితో కలుపుకుంటే ఆ సంఖ్య 17 కు చేరనుంది. అదే జరిగితే విశాఖ నగరపాలక సంస్థ టిడిపి కూటమి కైవసం చేసుకోవడం ఖాయం.

    * విశాఖపై పట్టుకు
    మరోవైపు విశాఖ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. విజయవాడ, కర్నూలు నగరపాలక సంస్థల్లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. వాస్తవానికి అక్కడ వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. టిడిపి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేసరికి వైసిపి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అందుకే విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల విషయాన్ని టిడిపి కూటమి సీరియస్ గా తీసుకుంది. కార్పొరేటర్లు పార్టీలో చేరిన తర్వాత పవన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు.విశాఖ స్థాయి సంఘఎన్నికల్లో టిడిపి కూటమి గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

    * ఆ రెండు ఎన్నికల కోసమే
    ప్రస్తుతం విశాఖలో రెండు ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, రెండోది స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇప్పటికే వైసీపీ మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. కూటమి పార్టీలు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో వైసిపి ప్రజాప్రతినిధుల చేరికలు పెరగడం విశేషం.