Godavari Dry Fish: ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో చేపలు ఒకటి. రకరకాలుగా వంటలు చేసుకోవచ్చు. అభిరుచులకు తగ్గట్టు వాటిని మార్చుకోవచ్చు. ఎండు చేప, పచ్చి చేప, ఉప్పు చేప, నీటి చేప.. ఇలా చేపలు రకరకాల రూపాల్లో ఉంటాయి. అయితే వీటిలో చప్పిడి చేపలు ప్రత్యేకం. అలాగని ఇవి చప్పగా ఉంటాయి అనుకుంటే పొరపడినట్టే. అదిరిపోయే రుచి వీటి సొంతం. సాధారణంగా పచ్చి చేపలను తెచ్చుకున్న వెంటనే వండుకోవాలి. లేకుంటే నిల్వ చేయడం కోసం ఫ్రిజ్లో పెట్టాలి. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఎండు చేపలు కొనుక్కోవాలి. కానీ ఈ చప్పిడి చేపలు ఫ్రిజ్లో పెట్టకపోయినా వారం రోజుల వరకు ఏమీ కావు. ఇదే వీటి ప్రత్యేకత.
* మడ అడవుల్లో దొరికే కర్రలపై..
సాధారణంగా తూర్పుగోదావరి( East Godavari) జిల్లాలోని మడ అడవులు అధికం. పచ్చిగా దొరికే చేపలను ప్రత్యేకమైన కర్రల మధ్య, చెరకు పిప్పి తో గడ్డిని ఉంచి కాల్చడమే.. ఈ చప్పిడి చేపల ప్రత్యేకం. సాధారణంగా చేపల్లో 30 రకాల వరకు ఉంటాయి. అందులో కట్టిపరిగ, ఇసుక దొందులు, కొయ్యంగ చేపలను ఈ పద్ధతిలో కాలుస్తుంటారు. వీటిని వండుకోవడం కూడా చాలా సులభం. పైన పొట్టు ఉంటుంది. అది తేలిగ్గా వచ్చేస్తుంది. వీటిని మొక్కలుగా కోసుకొని, మునక్కాడ, కోడిగుడ్డు, చిక్కుడుకాయ కాంబినేషన్ తో వండుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది అంటున్నారు భోజన ప్రియులు. అయితే వీటిని విడిగా కూడా వండుకోవచ్చు. ఇగురుకూరలుగా కూడా బాగుంటాయి.
* ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ చప్పిడి చేపలను ఎక్కువగా ఆరగిస్తుంటారు భోజనం ప్రియులు. అయితే వీటిని కాల్చడం మాత్రం ప్రత్యేకమైన కళ. పంది పల్లం, పి గన్నవరం ప్రాంతాల్లో ఇలా కాల్చిన చేపలకు విపరీతమైన గిరాకీ. వీటినే ఆర్చిన చేపలు అని, పొగ బెట్టిన చేపలని కూడా పిలుస్తారు. వీటి ముల్లులను తీసి కూడా వండుకోవచ్చు.
* సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కువగా కోనసీమ జిల్లాల్లో చప్పిడి చేపలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. చాలామందికి వీటి విక్రయం ద్వారా ఉపాధి లభిస్తుంది. అయితే అందరూ ఈ చేపలను అలా కాల్చలేరు. అనుభవం ఉన్నవారు కాల్చితేనే ఈ చేపలు రుచిగా ఉంటాయి. అయితే దీనిని ఒక కుటీర పరిశ్రమగా మార్చి మార్కెటింగ్ తో పాటు రవాణా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.