Srikakulam : ఇప్పుడు శ్రీకాకుళం( Srikakulam ) జిల్లా పేరు మార్మోగిపోతోంది. నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ చిత్రం నిన్ననే విడుదలైంది. సాయి పల్లవి హీరోయిన్ గా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా ఆలోచింపజేసింది. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వెతలను తెలియజెప్పింది. 2018లో పాక్ బందీలుగా మారిన శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత గాధను సినిమాగా తెరకెక్కించారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు స్థానికంగా ఉపాధి దొరకక.. వేట గిట్టుబాటు కాక సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వైనాన్ని చాటి చెప్పింది ఈ చిత్రం.
* 11 మండలాల్లో తీర ప్రాంతం
193 కిలోమీటర్ల తీర ప్రాంతం( seashore area ) సిక్కోలు సొంతం. ఏపీవ్యాప్తంగా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా.. అందులో ఎక్కువ భాగం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. రణస్థలం మండలం ధోని పేట నుంచి ఇచ్చాపురం మండలం డుంకూరు వరకు తీరం విస్తరించి ఉంది. దాదాపు 11 మండలాల్లో తీర ప్రాంతం ఉండగా.. తీరంలో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 2 లక్షల మంది మత్స్యకార జనాభా ఉన్నారు. కానీ స్థానికంగా వేట సాగించలేని మత్స్యకారులు వలస బాట పడుతున్నారు. కేవలం 50 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే స్థానికంగా వేట సాగిస్తున్నారు. అది కూడా అతి కష్టం మీద.
* ఇతర ప్రాంతాలకు వలస బాట
అయితే తీర ప్రాంతంలో( seashore area ) ఉన్న ప్రతి గ్రామంలో మత్స్యకార యువత ఉపాధి బాట పడుతుంటారు. గుజరాత్ లోని వీరావల్ ప్రాంతం తో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో ఊరి నుంచి బయలుదేరుతారు. తిరిగి మార్చి నెలలో స్వగ్రామాలకు చేరుకుంటారు. ఇతర ప్రాంతాల్లో కాంట్రాక్టర్ల వద్ద పనికి కుదురుతారు. ప్రమాదకరస్థాయిలో వేట సాగిస్తుంటారు. ప్రమాదాల్లో మృత్యువాత కూడా పొందుతుంటారు. ఒక్కోసారి సరిహద్దు జలాల్లో ప్రవేశించి విదేశీ బందీలుగా మారుతుంటారు.
* సరైన వసతులు లేక
వాస్తవానికి శ్రీకాకుళం( Srikakulam ) జిల్లా మత్స్యకారులు బంగాళాఖాతం తో పాటు హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం లో చేపల వేటకు వెళుతుంటారు. జిల్లాలో సుదూర తీర ప్రాంతం ఉన్న సరైన హార్బర్ కానీ.. పోర్టు కానీ.. జెట్టి కానీ లేదు. ఇతర ప్రాంతాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టి ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ మత్స్యకార యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ లెక్కన ప్రతి గ్రామంలో తండేల్ కథ రిపీట్ అవుతూనే ఉంటుంది.