TDP Janasena Alliance: ఏపీలో ఉమ్మడి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడానికి టిడిపి, జనసేనలో భారీ వ్యూహం రూపొందిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య ప్రకటన వచ్చిన రాజమండ్రిలోనే తొలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జనసేన అధ్యక్షుడు పవన్, నారా లోకేష్ నేతృత్వంలో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేందుకు సమయం పట్టనుండడంతో.. ఎటువంటి జాప్యం జరగకుండా ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజమండ్రిలో ఈనెల 23న సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్, లోకేష్ ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చించనున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల తరఫున జాయింట్ యాక్షన్ కమిటీలను నియమించారు. సభ్యులను సైతం ప్రకటించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల ఆత్మీయ కలయిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు పార్టీలు కలిసి సమావేశమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి అధికార వైసీపీ సోషల్ మీడియా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. విష ప్రచారం ప్రారంభించింది. దీనిపై కూడా రెండు పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన నాయకులతో టిడిపి నేతలు సమన్వయమయ్యేలా కొన్ని సూచనలు చేయనున్నారు. అటు కీలక నియోజకవర్గాల విషయంలో సైతం క్లారిటీ ఇవ్వనున్నారు.
ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు ప్రకటించనున్నారు. పవన్ వారాహి యాత్ర, నారా లోకేష్ భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర, నారా భువనేశ్వరి సంఘీభావ యాత్ర ఏకకాలంలో నిర్వహించి పొత్తుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి ఎటువంటి కార్యక్రమం జరిగిన రెండు పార్టీల శ్రేణులు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. పొత్తులకు లోబడే నేతలు ప్రకటనలు చేయాలని.. పొత్తుకు విఘాతం కలిగించే అంశాల జోలికి పోకూడదని ఇరు పార్టీల నాయకులకు ఓ స్పష్టమైన సూచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు లేకుండానే తొలి భేటీ జరుగుతుండడం విశేషం.