AP Rains: అంతటా సంక్రాంతి శోభ నెలకొంది. పండుగకు తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మరికొద్ది గంటల్లో సంక్రాంతి వెలుగులు నింపనున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి బిగ్ అలెర్ట్ వచ్చింది. ఏపీకి వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరికలు వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పండుగ పూట కూడా వాన గండం తప్పదని స్పష్టం చేసింది. బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* భారత వాతావరణ శాఖ హెచ్చరిక
వాస్తవానికి ఈ నెల 12 నుంచి ఏపీలో వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. కానీ అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ కేంద్రం తమకు ఎటువంటి సంకేతాలు అందలేదని చెప్పడం విశేషం. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య తూర్పు గాలుల ప్రభావంతో ఆవర్తనం మరింత బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అందుకే ఈ నెల 12 నుంచి వర్షాలు పడతాయని చెప్పుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
* గాలులు వీచే అవకాశం
ఉపరితల ఆవర్తనానికి సంబంధించి గాలుల వేగం అధికంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అత్యధికంగా గంటకి 55 కిలోమీటర్ల వేగం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక,తమిళనాడుతో సహా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
* కొంత అస్పష్టత
అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ కేంద్రం ఒకలా చెబుతుంటే.. అమరావతి వాతావరణ కేంద్రం తమకు సమాచారం లేదని చెబుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం ఏపీ తో పాటు పక్కనే ఉన్న యానం పై కూడా ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే పండుగ వేళలో ఏపీకి వర్షాలు తప్పేలా కనిపించడం లేదు.