Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నారా? ఏపీ రాజకీయాలపై మాట్లాడడం లేదు ఎందుకు? సడన్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎందుకు? ఆ ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు ఎందుకు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల విషయంలో రామ్ గోపాల్ వర్మ సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. వైసీపీ నేతలకు మించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు అండగా నిలిచారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పోలింగ్ తర్వాత ఏపీ రాజకీయాల గురించి కనీస ప్రస్తావన లేదు. ఇప్పుడు దర్శకుల అసోసియేషన్ పేరుతో తెలంగాణ సీఎం రేవంత్ ను కలవడంతో.. ఆర్జీవి లో ఈ మార్పు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సినీ రంగం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు రాంగోపాల్ వర్మ నుంచి వినిపించేవి. గత ఎన్నికలకు ముందు నుంచే ఆయన వైసీపీకి పనిచేస్తున్నారు. ఎన్నికల అనంతరం కూడా ఆ పార్టీకి పనిచేశారు. సోషల్ మీడియా ఇచ్చే కంటెంట్ను పూర్తి చేసేవారు. ప్రత్యర్థి ఎవరైనా పట్టించుకునేవారు కాదు. అయితే దీనికి గాను కోట్లాది రూపాయల పేమెంట్లు అందుకునే వారు. ప్రభుత్వానికి ఏదో సర్వీస్ చేసినట్లుగా ఆయన కోట్ల పేమెంట్లు తీసుకున్న విషయం బయటకు రావడం సంచలనంగా మారింది.
ఎన్నికలకు ముందు వ్యూహం, శపథం పేరిట వైసీపీకి ఫేవర్ చేసే సినిమాల చిత్రీకరణకు ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రాజధాని ఫైల్స్, యూట్యూబ్లో విడుదలైన వివేకం సినిమాలు రాంగోపాల్ వర్మను అధిగమించాయి. అటు ఆర్జీవితో లాభం కంటే నష్టమని వైసిపి నుంచి ఒక రకమైన వ్యాఖ్యలు వినిపించాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాంగోపాల్ వర్మ సైలెంట్ అయ్యారు. ఎన్నికల పూర్తయిన తర్వాత సోషల్ మీడియా అకౌంట్ నుండి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం మానేశారు. ఎన్నికల ఫలితాలు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నన్న టెన్షన్ రామ్ గోపాల్ వర్మ లో పెరిగింది. అసలు అసోసియేషన్ అంటేనే ఆయనకు నచ్చదు. అటువంటిది కొంతమంది దర్శకులను తీసుకుని వెళ్లి అసోసియేషన్ పేరిట రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్జీవి భయపడ్డాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి.