Amaravati: అమరావతికి ఊపిరి

అందరి ఆమోదంతో నాడు చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధానికి ఆమోదముద్ర వేసింది. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ సైతం మద్దతు తెలిపారు. అదే సమయంలో రైతుల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాలను అమరావతి రాజధానికి అప్పగించారు.

Written By: Dharma, Updated On : June 5, 2024 12:54 pm

Amaravati

Follow us on

Amaravati: మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు’.. బాహుబలి సినిమాలో అనుష్క చెప్పే డైలాగ్ ఏది. ఏళ్ల తరబడి బందీగా ఉంటూ.. బానిసలుగా బతికే ప్రజల కోసం బాహుబలి రూపంలో ప్రభాస్ వస్తాడు. ఆ సమయంలో చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చుగుద్దినట్టు అమరావతి రైతులకు సరిపోతుంది. గత ఐదు సంవత్సరాల నిరీక్షణకు ఫలితం లభించింది. అమరావతికి ఊపిరి పోసేలా టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. దీంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు. ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు.

అందరి ఆమోదంతో నాడు చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధానికి ఆమోదముద్ర వేసింది. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ సైతం మద్దతు తెలిపారు. అదే సమయంలో రైతుల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాలను అమరావతి రాజధానికి అప్పగించారు.కానీ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి పై విషం చిమ్మారు. మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు. అప్పటినుంచి అమరావతి ఉద్యమం ఎగసి పడింది. పతాక స్థాయికి చేరింది. అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు తెలిపాయి. అయినా సరే వైసీపీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అమరావతిని ఎంతలా నిర్వీర్యం చేయాలో అంతలా చేసింది. మంత్రులైతే అమరావతిని స్మశానంతో పోల్చారు. దీంతో అమరావతి రైతులు తల్లడిల్లిపోయారు. అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవెల్లి దేవస్థానాలకు పాదయాత్రగా బయలుదేరారు. అప్పుడు కూడా వైసీపీ సర్కార్ నుంచి ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చాయి. పోలీసులతో ఉక్కు పాదం మోపించారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. నేతలతో దాడి చేయించారు. సుప్రీంకోర్టులో అమరావతిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మూడు రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ ఈసారి అధికారంలోకి వస్తే విశాఖలో ప్రమాణస్వీకారం చేసి పాలన ప్రారంభిస్తారని జగన్ శపధం చేశారు.

అయితే తాజా ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం పలకరించడంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తమకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నిన్నటి ఉదయం నుంచే అమరావతి ప్రాంతంలో రైతుల సందడి అంతా ఇంతా కాదు. కూటమి గెలుపు ఖాయమైన మరుక్షణం మహిళలు, వృద్ధులు, చివరకు చిన్నారుల సైతం రహదారుల పైకి వచ్చి నృత్యాలు చేశారు. ఆనందంతో పరవశించి పోయారు. ఇక అమరావతికి తిరుగు లేదని.. ఊపిరి పీల్చుకో అంటూ సగర్వంగా చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే టిడిపి కూటమి గెలుపు ఆ పార్టీలకే కాదు.. అమరావతి ప్రాంత రైతులకు సైతం ఊపిరిని ఇచ్చినట్లు అయింది.