Fake liquor Scam : ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తంబళ్లపల్లి నియోజకవర్గం లో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. దీని వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేసింది. నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులు రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు కావడంతో ఏమాత్రం వెనకడుగు వేయకుండా కూటమి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారంలో ఏ -1 గా జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా అతడు సంచలన విషయాలను బయటపెట్టాడు.
నకిలీ మద్యం కేసులో జనార్దన్ సంచలన వీడియో
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పారు
జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ
ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికే కుట్ర చేశారు
కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాం
ఈ ఏడాది ఏప్రిల్ లో… pic.twitter.com/VBwEMwwF4v
— ChotaNews App (@ChotaNewsApp) October 13, 2025
నకిలీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత వైసిపి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. నకిలీ మద్యం మొత్తం కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేస్తున్నారని.. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారని మండిపడింది. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సొంత మీడియాలో రకరకాల కథనాలను వండి వార్చింది. అయితే అసలు విషయాలను మాత్రం వైసిపి బయట పెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు జనార్దన్ రావు విచారణలో సంచలన విషయాలను వెల్లడించడంతో వైసిపికి తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం మాత్రమే కాకుండా మద్యం కుంభకోణం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం వ్యవహారాలపై ఉక్కు పాదం అవ్వడంతో అప్పటి భాగోతాలు మొత్తం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే విషయాన్ని జనార్దన్ రావు కూడా అంగీకరించారు..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారుచేసినట్టు జనార్దన్ రావు అంగీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పెంచడంతో నకిలీ మద్యం వ్యాపారాన్ని నిలిపివేసినట్టు జనార్దన్ రావు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జనార్దన్ రావుకు జోగి రమేష్ ఫోన్ చేశారు. నకిలీ మద్యం తయారు చేయాలని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని జోగి రమేష్ జనార్దన్ రావును ఆదేశించారు. మొదట్లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేయాలని అనుకున్నారు. రమేష్ ఆదేశాలు వేరే విధంగా ఉండడంతో తంబళ్లపల్లిలో తయారి కేంద్రాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో మద్యం దుకాణాలను జనార్దన్ రావు తీసుకున్నారు. పైగా తంబళ్లపల్లి ప్రాంతం ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉండడంతో.. ప్రభుత్వంపై బురద చల్లడానికి అవకాశం ఉంటుందని జోగి రమేష్ ఆ విధంగా స్కెచ్ వేశారు. దానిని జనార్దన్ రావు అమలు చేశారు. ఇతర వ్యక్తుల పేరు మీద గదులను అద్దెకి తీసుకొని.. మద్యం తయారీకి కావలసిన యంత్రాలను మొత్తం తీసుకొచ్చారు.. ఇక ఆ తర్వాత తయారీ మొదలుపెట్టారు. ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నాన్ని ప్రారంభించారు.. అంతేకాదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జనార్దన్ రావు అండగా ఉంటారని జోగి రమేష్ మాట కూడా ఇచ్చారు.. దీంతో జనార్దన్ రావు నకిలీ మద్యాన్ని జోరుగా తయారు చేయించడం మొదలుపెట్టారు.
నకిలీ మద్యం తయారవుతున్న క్రమంలోనే జనార్దన్ రావు ను ఉన్నట్టుండి ఆఫ్రికా పంపించారు. ఆఫ్రికాలో జనార్దన్ రావుకు ఒక స్నేహితుడు ఉన్నారు. ఎప్పుడైతే జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లారో.. అప్పుడే జోగి రమేష్ తన అనుచరుల ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు లీకులు ఇచ్చారు. అధికారుల ద్వారా దాడులు చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఈ వ్యవహారంలో టిడిపి నేతలు ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే వారిని సస్పెండ్ చేశారు. ఇది జోగి రమేష్ ఊహించలేదు. దీంతో మళ్ళీ జనార్దన్ రావుకి ఫోన్ చేసి ప్రణాళిక అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని.. ఈసారి ఇబ్రహీంపట్నంలో కూడా దాడి చేయిద్దాం.. సరుకు తీసుకొచ్చి పెట్టని జనార్దన్ రావు జోగి రమేష్ ఆదేశించారు. ఇబ్రహీంపట్నంలోని గోదాంలో ముందు రోజే అన్ని సరుకులు తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ జనార్దన్ రావును ఆదేశించారు. జోగి రమేష్ చెప్పినట్టే జనార్దన్ రావు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. దీనికి తోడు వైసిపి అనుకూల మీడియా సాక్షిని కూడా ముందుగానే అక్కడ ఉంచారు. ఈసారి జోగి రమేష్ ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది.
ఇదే సమయంలో జోగి రమేష్ జనార్దన్ రావు కి ఫోన్ చేసి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. బెయిల్ కూడా ఇప్పిస్తానని చెప్పాడు. కానీ చివరికి జోగి రమేష్ జనార్దన్ రావుకు హ్యాండ్ ఇచ్చాడు. అంతేకాదు జనార్దన్ రావు తమ్ముడిని కూడా ఈ కేసులో ఇరికించాడు. జనార్దన్ రావు స్నేహితుడు జయచంద్ర రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని అతడు అనుకుంటున్నాడు. అయితే అతడికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని.. ఆస్థానంలో నీకు సీటు ఇస్తామని జోగి రమేష్ జనార్దన్ రావుకు హామీ కూడా ఇచ్చాడు. అయితే ఈ వ్యవహారంలో జయచంద్ర రెడ్డి పేరును వైసిపి తెగ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇందులో అతని పాత్ర లేదని జనార్ధన స్పష్టం చేశాడు.. జోగి రమేష్ నమ్మించి మోసం చేసిన నేపథ్యంలోనే జనార్దన్ రావు బయటకు వచ్చి ఈ విషయాలు మొత్తం వెల్లడించాడు. దీంతో వైసిపి కుట్ర బయటపడింది.