BRS In AP: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ అంతా అషామాషి కాదు. సులువుగా ఏపీ ప్రజల మనసు గెలుచుకొని పార్టీ జెండా పాతేస్తామని కేసీఆర్ భావించారు. ఈ క్రమంలో కొద్దిగా అతి చేసి అడ్డంగా బుక్కవుతున్నారు. మొన్న ఆ మధ్యన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా సమయం వచ్చాక చేతులెత్తేశారు. అదంతా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ కోసమేనంటూ ప్రజలు తెలుసుకునేలా తెలంగాణ పాలకులు ప్రవర్తించారు. అయితే వరుసగా బీఆర్ఎస్ నేతల మాటలు తేలిపోతున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఏపీ సమాజంలో నవ్వులపాలవుతున్నాయి. రాజకీయ వ్యూహాలు ప్రతికూలతలుగా మారుతున్నాయి.
మల్లగుల్లాలు..
బీఆర్ఎస్ ను ఏపీలో ఎలా విస్తరించాలో తెలియక కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. సానుకూలాంశం కనిపించకపోవడంతో మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. అయితే దాయాది రాష్ట్రంపై పట్టు దొరకకపోయేసరికి ఓకింత అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఏపీ విషయంలో దూకుడుగా ముందుకెళితే తెలంగాణ ప్రజలు దూరమవుతారన్న బెంగా కేసీఆర్ ను వెంటాడుతోంది. ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, పంపకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని కేసీఆర్ కు తెలుసు. అందుకే విశాక స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకు వచ్చినట్టే వచ్చి వెనక్కితగ్గారు.
ఎన్నో విధాలుగా..
తొలుత సామాజికవర్గాన్ని అడ్డంపెట్టుకొని ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలని కేసీఆర్ భావించారు. తన సొంత సామాజికవర్గం అధికంగా ఉండే ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు. అటు టీడీపీలో తన పాత్ర మిత్రులను ఆకర్షించాలని భావించారు. కానీ వారు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అటు కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకోవాలని భావించారు. అందులో భాగంగా తోట చంద్రశేఖర్ లాంటి వారిని పార్టీలోకి రప్పించుకున్నారు. వారి ద్వారా కాపులకు దగ్గర కావాలని భావించారు. అది కూడా కలిసి రాలేదు. అయితే ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నించినా.. స్వరాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయని తెలిసి అక్కడ కూడా వెనక్కి తగ్గారు.
అసలు సిసలు పరీక్ష
ఇప్పుడు అసలు సిసలు పరీక్షను ఎదుర్కొంటున్నారు. కృష్ణా జలాల వినియోగం లో ఏపీకి అనుకూలంగా వ్యహరించలేకపోయారు. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నీటిని కూడా తమకే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా డి్మాండ్ చేస్తూ పంచాయతీని కేంద్రం ముందు పెట్టింది. ఇది ఇప్పుడు ఏపీలో విస్తృత చర్చకు కారణం అవుతోంది.ఏపీకి న్యాయంగా కేటాయించిన నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. రెండు రాష్ట్రాల మధ్యన 2015 , 16లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణానదీజలాల వినియోగంలో ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన 66:34 నిస్పత్తిలో నీటికేటాయింపులు కుదుర్చుకున్నాయి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఉంది. బచావత్ చేసిన 811టీఎంసీల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టింసీలు వినియోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందమే ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది. కానీ తమకు 50 శాతం వాటా ఉండాల్సిందేనని కేసీఆర్ సర్కారు వాదిస్తోంది. దీంతో ఏపీ ప్రయోజనాలను కాపాడుతానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయంటూ ప్రశ్న ఉత్పన్నమవుతోంది.