Exit Polls 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్ గా చెప్పాయి.ఏపీvవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వైసిపి ఒంటరి పోరుకు మొగ్గుచూపింది. టిడిపి, బిజెపి, జనసేన కూటమి కట్టాయి. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లలో పోటీ చేసింది. బిజెపి 10 అసెంబ్లీ,ఆరు లోక్సభ స్థానాల్లో బరిలో దిగింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంది. దేశవ్యాప్తంగా నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలను ప్రకటించనున్నారు. అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 88. దీంతో వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి.
అయితే మెజారిటీ జాతీయ సర్వే సంస్థలు టిడిపి కూటమికే చాన్స్ అని తేల్చేశాయి. 21 నుంచి 23 పార్లమెంట్ స్థానాలు కూటమికి రావచ్చని ఇండియా టుడే అంచనా వేసింది. మూడు పార్టీల మధ్య సమన్వయం కుదిరిందని తేల్చి చెప్పింది. ఓట్ల బదిలీ సవ్యంగా జరిగిందని స్పష్టం చేసింది. చంద్రబాబు అరెస్టు తర్వాత టిడిపి బలపడిందని అభిప్రాయపడింది. ఏబీసీ సిఓటర్ ఏకపక్షంగా టిడిపికి ఫలితాలు ఇచ్చింది. 21 నుంచి 25 పార్లమెంటు స్థానాలను ఓటమి గెలుచుకునే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇండియా టీవీ సైతం టిడిపి కూటమికి జై కొట్టింది. 19 నుంచి 23 పార్లమెంట్ స్థానాలు రావచ్చని అంచనా వేసింది. న్యూస్ 18 సైతం టిడిపి కూటమిదే హవా అని తేల్చి చెప్పింది. 19 నుంచి 22 స్థానాలు రావొచ్చని స్పష్టం చేసింది. ఒకట్రెండు సర్వే సంస్థలు తప్ప అన్ని కూటమికే జై కొట్టడం విశేషం.
అయితే వైసీపీకి మొగ్గు చూపిన సర్వే సంస్థలు సైతం కొద్దిపాటి అధిక్యతనే చూపడం విశేషం. అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా సంస్థలు టిడిపి కూటమి భారీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్, సీఎన్ఎన్ న్యూస్ 18, ఏబీపీ సి ఓటర్, టుడేస్ చాణక్య, పి మార్క్, జంకి బాత్, రిపబ్లిక్ టీవీ మాట్రిజ్, ఇండియా టుడే సంస్థల సర్వేలు కూటమి విజయాన్ని అంచనా వేశాయి. ఒక్క టైమ్స్ నౌ సిటీ జి మాత్రం వైసిపి రెండోసారి గెలవబోతున్నట్లు అభిప్రాయపడింది.
అయితే ఈసారి కేకే సంస్థ ఆసక్తికర ఫలితాలను ప్రకటించింది. గత ఎన్నికల్లో వైసీపీకి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ ఎన్నికల్లో 151 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇప్పుడు అదే సంస్థ కూటమికి 161 సీట్లు వస్తాయని తేల్చి చెప్పడం విశేషం. అయితే ఇందులో టిడిపికి ఒక్కదానికే 133 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేల్చి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో ఆ పార్టీదే విజయం అని తేల్చింది. పది చోట్ల పోటీ చేసిన బిజెపి ఏడు స్థానాలను సాధిస్తుందని కూడా చెప్పడం విశేషం. వైసిపి కేవలం 14 స్థానాలకు పరిమితం అవుతుందని.. జనసేన అతిపెద్ద పార్టీల్లో రెండవదిగా నిలుస్తుందని తేల్చి చెప్పడం సంచలనంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తూ సక్సెస్ఫుల్ సంస్థగా పేరుపొందిన పీపుల్స్ పల్స్ సంస్థ కూడా కూటమికి భారీ విజయం కట్టబెట్టింది. 135 సీట్ల వరకు రావచ్చు అని తేల్చి చెప్పింది.
అయితే సర్వేల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆరా సంస్థ మాత్రం మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. 94 నుంచి 104సీట్ల వరకు రావచ్చని అంచనా వేసింది. వైసిపి 49 శాతం ఓట్లు సాధిస్తుందని.. కూటమికి 47% ఓట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది. వైసీపీకి ఆరాతో పాటు రేస్, ఆపరేషన్ చాణక్య, ఆత్మ సాక్షి ఎస్ఏఎస్, పోల్ స్ట్రాటజీ, అగ్ని వీర్, పొలిటికల్ లేబరేటరీ, జన్మత్, రాప్ స్ట్రాటజీ, టైమ్స్ నౌ ఈ టీజీ అనుకూల ఫలితాలు ఇచ్చాయి.