AP Elections Result : నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో ఏపీలో పాలకపక్షం ఎవరు అనేది తెలుస్తుంది. గత నెల 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోలింగుకు, కౌంటింగ్ కు మధ్య మూడు వారాల వ్యవధి రావడంతో మరింత గందరగోళానికి దారితీసింది. గెలుపు మాదంటే మాది అని అన్ని పార్టీల నేతలు ధీమా కనబరిచారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంత క్లారిటీ వస్తుందని అంతా భావించారు. అయితే లోకల్ ఎగ్జిట్ పోల్ సంస్థలు అధికార వైసీపీకి జై కొట్టగా.. జాతీయ సంస్థలు మాత్రం టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా రావడంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు సామాన్య జనాలు సైతం కన్ఫ్యూజన్లో ఉండిపోవాల్సి వచ్చింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడం కూడా అన్ని పార్టీలు తమకు అన్వయించుకుంటున్నాయి. తమకే కలిసి వస్తుందని భావిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని.. ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో.. తమకు లభిస్తుందని కూటమి అంచనా వేసింది.మరోవైపు పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలమని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వారు తమకే ఓటు వేశారని వైసీపీ ఒక అంచనాకు వచ్చింది. కొత్తగా ఓటు పొందిన ఎనిమిది లక్షల మంది మహిళలు తమకు అండగా నిలిచారని వైసీపీలో ధీమా కనిపిస్తోంది.అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ సైతంభిన్నంగా ఫలితాలు ఇవ్వడం మరింత అనుమానాలను పెంచింది.
కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించిన అన్ని పార్టీలు.. తమ పార్టీ అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కూటమి అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విజయం పై ధీమా వ్యక్తం చేశారు. ఏకపక్ష ఫలితాలు రానున్నాయని.. చివరి వరకు కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుది ఫలితాలు తరువాత అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నాకే బయటకు రావాలని సూచించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులతో నేరుగా మాట్లాడారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులను హైదరాబాదుకు రప్పించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైసిపి కవ్వింపు చర్యలకు స్పందించ వద్దని కూడా విజ్ఞప్తి చేశారు.
వైసీపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమీక్షించారు. నేరుగా వైసీపీ అభ్యర్థులతో మాట్లాడారు. కౌంటింగ్ ఏజెంట్లకు మార్గ నిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా ఉండవద్దని.. చివరి వరకు కేంద్రాలను విడిచి పెట్టొద్దని సూచించారు. మొత్తానికైతే నరాల తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఏపీలో విజేత ఎవరు అనేది తేలనుంది.