ETV AP Bureau Chief Adinarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కు చెందిన నారాయణ గత పాతికేళ్లుగా ఈనాడు గ్రూప్ లో పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. ఈయన ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ పొందారు. ప్రస్తుతం ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం ఈయన సొంత గ్రామం. సౌమ్యుడిగా పేరుపొందిన ఈయన.. జర్నలిజం సర్కిల్లో అజాతశత్రువుగా ఉన్నారు. నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు. ఆయన తన జర్నలిజం కెరియర్ ను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రారంభించారు.. శిక్షణ పూర్తయిన వెంటనే ఈటీవీలో తన పాత్రికేయ జీవితాన్ని మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. అయితే నారాయణ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఎముక మజ్జ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అయితే తన చికిత్స కోసం ఆయన సీఎంఆర్ఎఫ్ పథకాన్ని వినియోగించుకున్నారు. అయితే ఆ వ్యాధి నుంచి కోరుకున్న తర్వాత మళ్లీ తిరగబెట్టిందని నారాయణ స్నేహితులు అంటున్నారు.. అయితే ఆయనకు మెరుగైన వైద్యం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఓసి కూడా ఇచ్చిందని తెలుస్తోంది.. సరిగ్గా రెండు రోజులు క్రితం ఆయన కీమో చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తన ఇంటిలోనే మేడపై ఉదయం అటూ ఇటూ తిరుగుతుండగా కాలు జారి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆయన కన్నుమూశారు. అయితే క్యాన్సర్ నివారణ కోసం చేస్తున్న కీమోథెరపీ వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారని.. అందువల్లే ఆత్మహత్య చేసుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిని ఆయన కుటుంబ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. ఆయన మృతి పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిగ్బ్రాంతి
ఇక నారాయణ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి దారుణమని.. నిజాయితీపరుడైన జర్నలిస్టు ఇలా చనిపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. అతడు హఠాన్మరణం చందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ ఇలా చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. నారాయణ మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తన్నీరు ఆదినారాయణ కు విశేషమైన అనుభవం ఉందని.. అలాంటి వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. వర్తమాన అంశాలు, ప్రజా సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని.. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యానికి గురైనప్పుడు పరామర్శించానని.. కానీ ఇంతలోనే ఆయన చనిపోవడం బాధాకరమన్నారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ తన సంతాపంలో ప్రకటించారు.. అయితే నారాయణ మృతి పట్ల రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. అతడు అర్ధాంతరంగా చనిపోవడాన్ని పాత్రికేయ మిత్రులు తట్టుకోలేకపోతున్నారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. కాగా, నారాయణ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి.