AP Cabinet Meeting : రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతోందా..? ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతి పొందేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారా..? అంటే అవునన్న సమాధానమే రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఇందుకు బలాన్ని చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని జూన్ 7వ తేదీన నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలంటూ ఢిల్లీ నుంచి సమాచారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి పంపించినట్లు తెలిసింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కొద్ది రోజుల నుంచి వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఒకపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. మరొక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తూ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం..
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే అధికార వైసీపీ మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఉన్నాయి. ఆ దిశగానే సమాయత్తమవుతూ వస్తున్నాయి. తెలంగాణతోపాటు రాష్ట్రంలోనూ ఎన్నికల జరిగే అవకాశం కనిపిస్తోందంటూ రాజకీయ నిపుణుల విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మంత్రులకు, ఉన్నతాధికారులకు అత్యవసర సమాచారాన్ని చేరవేశారు. జూన్ 7వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.
ముందస్తు ప్రకటన ఉంటుందన్న చర్చ..
సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కిందట ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు. సోమవారం కూడా ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. అక్కడ నుంచి అత్యవసర ఆదేశాలను ఆయన రాష్ట్ర అధికారులకు, మంత్రులకు పంపించినట్లు తెలిసింది. జూన్ 7వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే మాత్రం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
వివేక కేసు ఉచ్చు బిగించుకునే అవకాశం..
గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ప్రస్తుతం అటు తిరిగి ఇటు తిరిగి సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించని సిబిఐ తాజాగా ఆయన పేరును చేర్చింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి వైసిపి అగ్ర నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ముందస్తుకు సిద్ధపడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజుల నుంచి ఈ కేసు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఒకవేళ వీరిద్దరిలో ఎవరిదైనా పాత్ర ఉన్నట్లు తెలితే మాత్రం వైసిపికి తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ కేసు విచారణ పూర్తయ్యేలోగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. చూడాలి ఈ అత్యవసర భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.