Eluru : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కూడా ఇవ్వనుంది. ఇప్పటివరకు ఎంతోమంది నిరుద్యోగులను వీరి ఆధ్వర్యంలో ఉపాధి కల్పించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఏడాది కూడా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం రంగంలో కానీ లేదా ప్రైవేటు రంగంలో కానీ ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులను అలాగే వాళ్ళ తల్లిదండ్రులను సమాజం ఏ ఉద్యోగం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. తాము చదువుకున్న చదువుకి న్యాయం చేయలేకపోతున్నాము అంటూ విద్యార్థులలో ఆందోళన కూడా మొదలయ్యింది. ఈ క్రమంలో ఈనెల 26 తేదీన ఏలూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ యువతీ యువకులకు 31 రోజులపాటు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ లో ఉచితంగా శిక్షణ నిర్వహిస్తుంది. అలాగే వీళ్ళందరికీ 15 రోజులు జ్యూట్ బ్యాగులు తయారు చేయడానికి కూడా శిక్షణ ఇస్తున్నారు.
ఈ క్రమంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్లో అలాగే భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. వాళ్లకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్తున్నారు. నిరుద్యోగ యువతీ యువకులు పదోతరగతి పాసై ఉండాలి. వీళ్ళందరూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల వారై ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఈ కోర్సులు కూడా నిర్వహిస్తుంది. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్నవారు దీనికి అర్హులు.
అర్హులైన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు జిరాక్స్ సెట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని వెళ్లాలి. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/zE06eqFqKMEB2iS8 లో మీ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా రిజిస్టర్ చేతుకున్న తర్వాత మీకు ఫోన్ ద్వారా సంప్రదించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎందుకంటే మీకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. అలాగే భోజనం మరియు వసతి కూడా పూర్తిగా ఉచితం. శిక్షణ పూర్తి అయిన తర్వాత మీకు ఉద్యోగం కూడా కల్పిస్తారు.