ED investigation impact on YSRCP: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది సంకట స్థితి. ఆ పార్టీ దేనికోసం భయపడుతుందో… దేనికోసం కేంద్రంలో బిజెపికి మద్దతు తెలుపుతుందో.. ఆ పని మాత్రం జరగడం లేదు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతల ఇళ్లలో ఈడి తనిఖీలతో ఈ విషయం బయటపడింది. 2019 నుంచి నేటి వరకు బిజెపి అడగకుండానే సాయం చేస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది ఎందుకోసమో అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి పై కేసులు ఉన్న దృష్ట్యా బిజెపికి రాజకీయ సహకారం అందిస్తూ వచ్చారు. ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. కానీ ఎంత మాత్రం బిజెపి తగిన రీతిలో వైసీపీకి ప్రయోజనం చేకూర్చడం లేదు. ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఈడి జప్తులకు కూడా దిగింది. ఇప్పుడు ఏకంగా సోదాలు జరపడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సాయం తమ నుంచి అందదు అనే సంకేతాలను పంపించింది.
బిజెపి ప్రత్యర్థులపైనే దాడులు..
సాధారణంగా బిజెపి పై ఒక విమర్శ ఉంది. బిజెపిని వ్యతిరేకిస్తే ఈ డి వాలిపోతుంది అనేది ఒక విమర్శ. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై ఈడి వాలిపోయింది. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కోపం ఉన్నట్టుగానే అర్థమవుతోంది. జాతీయస్థాయిలో బిజెపి ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతల ఇళ్లపై ఇది దాడులు అనేవి సర్వసాధారణంగా మారాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము బిజెపికి వ్యతిరేకం కాను అని సంకేతాలు పంపిస్తూనే ఉంది. బిజెపి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదన్న సంకేతాలు ఇచ్చింది ఈడీ దాడులతో. అయితే తాము బిజెపికి వ్యతిరేకం కాదు మహాప్రభో అని చెబుతున్నా వినడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వైసీపీకి మున్ముందు ఇబ్బందులే..
బిజెపి అనేది ఎన్డీఏ కు నాయకత్వం వహిస్తున్న పార్టీ. అదే ఎన్ డి ఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. అదే తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్న టిడిపి కూటమిలో బిజెపి ఒక భాగస్వామి. ఆ రెండు పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉంది. కానీ అదే బిజెపితో తెరవెనుక స్నేహం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించడమే అసలు సిసలు ప్రశ్న. అనధికారి మిత్రపక్షంగా కొనసాగుతున్న వైసిపి నేతలను కూడా ఈడి వెంటాడుతుండడం ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. అవసరం అనుకున్న ప్రతిసారి బిజెపి అడగకుండానే సాయం చేస్తూ వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఈడి దాడులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం స్పష్టత వస్తుంది. బిజెపి తమను ప్రత్యర్థిగా చూస్తోందని అర్థం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అతి ధీమాతో ఉండవచ్చు గాక. కానీ ఆ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో ఆ పార్టీతో జత కలిసే వారు లేరు. జాతీయస్థాయిలో ఏ కూటమి మద్దతు లేదు. పోనీ రహస్య స్నేహం కొనసాగిస్తున్న బిజెపి.. అదే రహస్య సహకారం ఇస్తుందనుకుంటే ఇప్పుడు ఈడిని ప్రయోగించింది. మున్ముందు ఇలాంటి విధానంతో ముందుకు వెళితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.