East Godavari : తూర్పుగోదావరి( East Godavari) జిల్లాలో టిడిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ వివాదాలను పరిష్కరించాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నాయకులు ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా మాట్లాడుతుండడంతో పరిస్థితి రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. భాగస్వామ్య పక్షం జనసేన ఇక్కడ బలంగా ఉంది. పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాకు చెందినవారు. దీంతో సహజంగానే జనసేన మాట చెల్లుబాటు అవుతూ వస్తోంది. దీంతో జనసేనకు సైతం పెద్ద ఎత్తున పదవులు దక్కుతున్నాయి. తమ అవకాశాలను జనసేన పట్టుకెళ్ళిపోతోందని టిడిపి నేతలు ఆవేదనతో ఉన్నారు. మరోవైపు టిడిపి నేతల మధ్య కూడా అంతర్గత విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన ఆవశ్యకత హై కమాండ్ పై ఉంది.
Also Read : పుంగనూరులో సిక్కోలు టిడిపి కార్యకర్తల సైకిల్ యాత్ర.. పెద్దిరెడ్డి కి షాక్!
* జనసేనకు ప్రాధాన్యతపై ఆగ్రహం
మొన్న ఆ మధ్యన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ(Jyotula Nehru )చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. జనసేన ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. తెలుగుదేశం పార్టీకి సరైన గుర్తింపు లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేత ఒకరికి రెండు పదవులు లభించడంపై గుర్తుచేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు విషయంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. బయటకు రాలేదు అంటూ గుర్తు చేసుకున్నారు. ఇలానే వ్యవహరిస్తే వామపక్షాలకు పట్టిన గతి టిడిపికి పడుతుందని కూడా హెచ్చరించారు. తద్వారా పొత్తుతో జనసేన అధిక ప్రయోజనాలు పొందుతోందని జ్యోతుల నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. మినీ మహానాడు వేదికగా ఈ కీలక ప్రకటనలు చేశారు.
* జిల్లాకు దూరంగా సీనియర్ నేత..
మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు( yanamala Ramakrishna ) అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్. తూర్పుగోదావరి జిల్లాలో వ్యవహారాలు నడిపేది కూడా ఆయనే. కానీ ఎందుకో ఇటీవల యాక్టివ్ తగ్గించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన తప్పుకున్నారు. ఆయన బదులు కుమార్తె శ్వేతా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయనకు కొనసాగింపు దక్కలేదు. రాజ్యసభ పదవిని ఆశించారు. అది కూడా ఆయనకు దక్కలేదు. ఇటీవల పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. మహానాడు కమిటీల్లో కూడా క్రియాశీలకంగా ఉన్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి పెద్దగా పట్టించుకోవడం మానేశారు.
* ఎమ్మెల్యేల మధ్య వార్..
మరోవైపు రాజమండ్రి అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రాజమండ్రి అర్బన్ నుంచి గెలిచారు ఆదిరెడ్డి వాసు. రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం రాక తన ఘనత అని ప్రకటించుకున్నారు ఆదిరెడ్డి వాసు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బుచ్చయ్య చౌదరి. 1983 లోనే తెలుగు యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్టీఆర్తో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేశానన్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. రాజమండ్రి అభివృద్ధిలో తన పాత్ర ఉందని చెప్పుకొచ్చారు. ఏడాదిలో ఎటువంటి పాలన జరగలేదని.. ఫ్లెక్సీలతో పాలన సాగించారని ఎద్దేవా చేశారు. మొత్తానికి అయితే గోదావరి జిల్లాల్లో టిడిపి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.