Dwarapureddy Vs Pawan : ద్వారపురెడ్డికి అండగా మరో కాపునేత.. మరీ ఇంత దిగజారుడా?

ఇంతకంటే మరో అన్యాయం ఉంటుందా? అన్న ప్రశ్న సగటు కాపు సామాజికవర్గం వ్యక్తి నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే ద్వారపురెడ్డి కుటుంబం కాపుల అభ్యున్నతికి పుట్టిందంటూ కొత్తగా చేస్తున్న ప్రచారం మరింత జుగుప్సాకరంగా ఉంది.

Written By: Dharma, Updated On : June 21, 2023 2:44 pm
Follow us on

Dwarapureddy Vs Pawan : మా తాతలు నేతులు తాగారు. మా మూతులు చూడండి అన్నట్టుంది ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో కొందరు చేస్తున్న వింత వాదన. ద్వారపురెడ్డి జనసేన శ్రేణులను ఇబ్బందిపెట్టింది నిజం. కాకినాడ నగరంలో జులుం చెలాయిస్తోంది నిజం. విపక్షాలను టార్గెట్ చేసుకుంది నిజం. అంతకంటే ముందు పవన్ ను వ్యక్తిగతంగా, వాడరాని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేసింది నిజం. కానీ అప్పుడెప్పుడూ రాని పాత్రధారులు, సూత్రధారులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంచి వ్యక్తి అని కితాబిస్తున్నారు. తాతలు, తండ్రులు కాపు జాతి ఔన్నత్యానికి పాటుపడ్డారంటూ కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. తొలుత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు కొత్తగా వంగవీటి మోహన్ రంగా బావమరిదిని తెరపైకి తెచ్చి పవన్ ది తప్పిదంగా బూతద్ధంలో చూపే ప్రయత్నం చేస్తున్నారు.
వారాహి యాత్రలో పవన్ ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పవన్, ద్వారపురెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు ద్వారపురెడ్డికి మద్దతుగా ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. తనపైనే విమర్శలు చేస్తావా? అని ఆగ్రహంతో ఊగిపోయిన ముద్రగడ పవన్ అడిగిన అనుమానాలను నివృత్తి చేయకుండా ద్వారపురెడ్డిని వెనుకేసుకొచ్చారు.  కాపు రిజర్వేషన్ ఉద్యమానికి ద్వారపురెడ్డి కుటుంబం అన్ని విధాలా సాయమందించిందని లేఖలో పేర్కొన్నారు.అక్కడితో ఆగకుండా రాజకీయ సవాల్ చేశారు. మీకు దమ్ముంటే ద్వారపురెడ్డిపై పోటీచేయాలని సైతం పవన్ కు సూచించారు. వైసీపీ స్క్రిప్ట్ తోనే ఈ లేఖ సాగినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్తగా మరో పాత్రధారిని బయటకు తీసుకొచ్చారు. ఆయనే వంగవీటి మోహన్ రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ ను రంగంలోకి దించారు. ఆయన బయటకు వచ్చి ఏకంగా ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. అలాంటి నాయకుడు ఉండరంటూ కితాబిచ్చేశారు. మోహన్ రంగా తోనే ద్వారపురెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తుచేశారు. అప్పట్లోనే  ఎంతో సంపన్న కుటుంబమని చెప్పుకొచ్చారు. వంగవీటి అభిమానుల్లో ద్వారపురెడ్డి కుటుంబం ఒకటని కూడా ప్రకటించారు. అటువంటి కుటుంబం చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దని హితవుపలికారు. తాను పొలిటికల్ కెరీర్ లో లేనంటూనే చెన్నుపాటి శ్రీనివాస్ రాజకీయాలన్నీ మాట్లాడేశారు.
అయితే ఇప్పుడు ద్వారపురెడ్డి కుటుంబం చుట్టూనే రాజకీయం తిరగడం విశేషం. గత నాలుగేళ్లలో ఇదే ద్వారపురెడ్డి పవన్ ను తిట్టని రోజంటూ లేదు. కానీ ఒక్క కాపు నాయకుడు కూడా ఎదురొచ్చిన దాఖలాలు లేవు. కానీ పవన్ అదే ద్వారపురెడ్డిపై విమర్శలు చేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇంతకంటే మరో అన్యాయం ఉంటుందా? అన్న ప్రశ్న సగటు కాపు సామాజికవర్గం వ్యక్తి నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే ద్వారపురెడ్డి కుటుంబం కాపుల అభ్యున్నతికి పుట్టిందంటూ కొత్తగా చేస్తున్న ప్రచారం మరింత జుగుప్సాకరంగా ఉంది.