Duvvada Srinivas: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అసలే ఇబ్బందుల్లో ఉంది. కానీ మరికొందరి తీరుతో మరింత ఇబ్బందుల్లో నెడుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నుంచి పదవులు అందుకున్న వారే ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అసలు చట్టసభలకు ఎన్నిక కాలేదు దువ్వాడ శ్రీనివాస్. నామినేషన్ వేయడమే.. కానీ గెలిచింది ఒక్కసారి కూడా లేదు. అటువంటి నేతను పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ వ్యక్తిగత కుటుంబ వివాదాలతో పార్టీకి దూరమయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ హై కమాండ్. పార్టీలోకి తిరిగి రావాలనుకుంటున్నారు దువ్వాడ. కానీ శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ధర్మాన ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్ లో పడేశారు. నేను కావాలా? ధర్మాన బ్రదర్స్ కావాలా? అనే పరిస్థితికి వచ్చారు దువ్వాడ. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి భారీగా డ్యామేజ్ జరుగుతోంది.
తన ఓటమి వెనుక కారణం వారేనని..
దశాబ్దాలుగా చట్టసభలకు ఎన్నిక కావాలని దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas) ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన వారు ఎమ్మెల్యేలు అయ్యారు. మంత్రులు అయ్యారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం కాలేకపోతున్నారు. అయితే తన రాజకీయ జీవితానికి ధర్మాన, కింజరాపు ఫ్యామిలీ లే ఎండ్ కార్డు వేస్తున్నాయి అనేది దువ్వాడ శ్రీనివాస్ అనుమానం. ఆ రెండు కుటుంబాలు కలిసి తనను నిత్యం ఓడిస్తున్నాయనే ఆవేదన ఆయనలో ఉంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గెలిస్తే.. తాను ఓడిపోవడానికి ధర్మాన ఫ్యామిలీ మ్యాచ్ ఫిక్సింగ్ కారణమన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడటానికి ధర్మాన ఫ్యామిలీ కారణం అన్నది కూడా ప్రధాన అనుమానం. అందుకే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గౌరవిస్తూ.. ధర్మాన బ్రదర్స్ పై విరుచుకుపడుతున్నారు దువ్వాడ. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాము ప్రయత్నిస్తుంటే.. తమను తిడుతున్న దువ్వాడ శ్రీనివాస్ను శాశ్వతంగా బహిష్కరించరు ఎందుకు అనేది ధర్మాన బ్రదర్స్ వాదన. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పై జగన్ సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు.
ఆ ఎత్తుగడను గమనించి..
తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించే ప్రయత్నం జరుగుతోందని అనుమానించారు దువ్వాడ శ్రీనివాస్. అందుకే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తన మార్కు రాజకీయం చూపించాలనుకుంటున్నారు. ధర్మాన, కింజరాపు ఫ్యామిలీలపై విమర్శల జడివాన కురిపిస్తూనే.. జిల్లాలో ప్రధాన సామాజిక వర్గమైన కాళింగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న వాదనను బయటపెడుతున్నారు. ఇటీవల కాళింగ సామాజిక వర్గ ఆత్మీయ కలయికను నిర్వహించి.. రాజకీయాలకు అతీతంగా నాయకులను ఆహ్వానించారు. ధర్మాన, కింజరాపు కుటుంబాల హవాకు బ్రేక్ పడాలంటే.. కాలింగ సామాజిక వర్గం ఏకతాటి పైకి రావాలన్న ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన కొంత సక్సెస్ అయినట్టు కనిపిస్తున్నారు. ఎప్పుడు పప్పు నిప్పులా ఉండే తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ లాంటి నేతలు ఒకే వేదికపై కనిపించడం వెనుక దువ్వాడ శ్రీనివాస్ మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ టిడిపి, వైసీపీలోని కాలింగ నేతలను ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మాన, కింజరాపు కుటుంబ కోటలను బద్దలు కొట్టాలని చూస్తున్నారు. మరి ఈ ప్రయత్నం 2029 ఎన్నికల వరకు తీసుకెళ్తుందా? మధ్యలోనే ఆగిపోతుందా? అన్నది చూడాలి.