Mlc duvvada : ఎమ్మెల్సీ దువ్వా కుటుంబ వ్యవహారంలో టిడిపి ప్రోత్సాహం ఉందా? టిడిపి నేతల అండదండలతోనే కుటుంబ సభ్యులు దాడి చేశారా? ఆ అవసరం టీడీపీకి ఉందా? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్న మాటల్లో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కింజరాపు కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు. కానీ ఆ కుటుంబం పై పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఓడిపోయారు. ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో కింజరాపు కుటుంబంతో కలిసి పనిచేశారు.దువ్వాడ శ్రీనివాస్ వైఖరి దూకుడుగా ఉంటుంది. యువజన కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ. యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తడబడ్డారు. అదే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా దువ్వాడ శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. కానీ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యతిరేకించడంతో జడ్పీ వైస్ చైర్మన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి ధర్మాన ప్రసాదరావుతో విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకే ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతున్నారని.. దాని వెనుక ధర్మాన ఉన్నారన్నది శ్రీకాకుళం నుంచి వినిపించే మాట. కాంగ్రెస్ లో అయినా.. వైసీపీలో అయినా అదే అదే పరిస్థితి ఎదురైంది.
* ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు లేదు
2014లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ దువ్వాడ ఓడిపోయారు. 2019లో ఎంపీగా పోటీ చేశారు. మళ్లీ ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఓటమి తప్పలేదు. అంతకుముందు హరిశ్చంద్ర పురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు దువ్వాడ. ఒక్క వైసీపీ నుంచే మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్లో అయితే చెప్పనవసరం లేదు. అయితే దువ్వాడ ఓడిపోవడానికి ఆయన స్వయంకృతాపం ఒక కారణం అయితే… కింజరాపు, ధర్మాన కుటుంబాలు కారణమన్నది మరో ఆరోపణ.
* సామాజిక వర్గాల ప్రభావం
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా సామాజిక వర్గపరంగా పోరు ఉంటుంది. ఇక్కడ వెలమ, కాలింగ, తూర్పు కాపు ప్రధాన సామాజిక వర్గాలు. అయితే తొలినాళ్లలో కాలింగుల ప్రభావం అధికంగా ఉండేది. ఆ సామాజిక వర్గం వారే కీలక పదవులు దక్కించుకునేవారు. క్రమేపి మార్పు వచ్చింది. కాపు సామాజిక వర్గం సైతం ప్రభావం చూపింది. కానీ ధర్మాన, కింజరాపు కుటుంబాల హవా ప్రారంభమైన తర్వాత.. మిగతా రెండు సామాజిక వర్గాల ప్రభ తగ్గింది. ముఖ్యంగా కాలింగ సామాజిక వర్గం ఎదగలేదు. అయితే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో మాత్రం ఆ రెండు కుటుంబాలు తొక్కి పెట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి.
* గెలుపు అందుకోలేని నేత
యువజన కాంగ్రెస్ నుంచి వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు చాలాసార్లు. కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా గెలవలేదు. చివరకు రాష్ట్రవ్యాప్తంగా 2019లో జగన్ ప్రభంజనం వీచి సామాన్యులు సైతం గెలిచారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గెలవలేదు. దీని వెనుక ధర్మాన కుటుంబం మంత్రాంగం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఎంపీగా దువ్వాడ గెలవక పోవడానికి.. ధర్మాన ప్రసాదరావు క్రాస్ ఓటింగ్ చేయడమే కారణం అంటూ అప్పట్లో జగన్కు ఫిర్యాదు చేశారు దువ్వాడ. ఆ కారణంగానే ధర్మాన ప్రసాదరావుకు మంత్రివర్గంలో తీసుకోలేదని దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం చేశారు. మొత్తానికి అయితే దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ కెరీర్ తో అటు కింజరాపు కుటుంబం, ఇటు ధర్మాన కుటుంబం ఒక ఆట ఆడుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా కుటుంబ వివాదంతో దువ్వాడ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Duvvada srinivasa raos political life was played by those two families
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com