Mlc Duvvada : ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటారు. ఎదుటివారిపై ఆరోపణలు చేసినప్పుడు అవి సుభాషితాలుగా కనిపిస్తాయి. కానీ అవి ఆరోపణలు తమపై వస్తే బాధపడతాం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సైతం అదే బాధపడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. వారిపై వ్యక్తిగత కామెంట్స్ చేసేవారు. వాడలేని భాష ప్రయోగించేవారు. ఇప్పుడు తన వివాహేతర సంబంధంతో కుటుంబం మొత్తం వీధిన పడింది. తెలుగు రాష్ట్రాల్లో పరువు పోయింది. రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడనుంది. ప్రజాక్షేత్రంలో పలుచనైపోయారు. ఇప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తోంది దువ్వాడ శ్రీనివాస్ కు. అందుకే తన చుట్టూ శత్రువులు పెరిగిపోయారని.. తాను చాలా మాటలు అనేశానని పశ్చాత్తాప పడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో. చాలాసార్లు పవన్ పై అనుచితంగా మాట్లాడారు దువ్వాడ. ఒకానొక దశలో చెప్పు తీసి చూపించారు కూడా. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. హిందూ మతానికే ఇది మాయని మచ్చ అని.. నాయకుడంటే ఏకపత్ని వ్రతుడుగా ఉండాలని.. రాముడు మాదిరిగా వ్యవహరించాలని.. కానీ పవన్ నీచుడని.. నికృష్టుడంటూ చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. దాదాపు గత ఐదేళ్లుగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తనపై వివాహేతర సంబంధం వివాదం నెలకొనడంతో పవన్ విషయంలో తాను తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.
* జనసైనికుల టార్గెట్
తన కుటుంబంలోజరుగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల మీడియాతో మాట్లాడారు దువ్వాడ.ప్రతి కుటుంబంలో వివాదాలు జరుగుతాయని.. అది సహజమని కూడా చెప్పుకొచ్చారు. దీంతో జన సైనికులు రెచ్చిపోయారు. విపరీతంగా దువ్వాడ కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో పవన్ విషయంలోదువ్వాడ చేసిన కామెంట్స్ ను జతచేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి ఘాటుగా రిప్లై ఇస్తున్నారు నెటిజెన్లు. దువ్వాడ కామెంట్స్ ను తప్పు పట్టిన వారే అధికం. ఏది తన వరకు వస్తే కానీ తెలియదని ఎక్కువమంది వ్యాఖ్యానించారు.
* పవన్ ఏ పరిస్థితుల్లో అలా చేశారో
అయితే ఓ ఇంటర్వ్యూలో విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ దువ్వాడ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మీరు ఇంతగా బాధపడుతున్నారని.. కానీ అందరి అంగీకారంతో విడాకులు తీసుకుని పవన్ వివాహాలు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు దువ్వాడ స్పందిస్తూ పశ్చాత్తాప పడ్డారు. పవన్ ఏ పరిస్థితుల్లో ఆ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారో తెలియదని.. ఇప్పుడు నాకు అర్థం అయింది అంటూ దువ్వాడ చేసిన కామెంట్స్ ని సైతం జన సైనికులు షేర్ చేస్తున్నారు.
* పవన్ పై విరుచుకుపడిన నేతల తీరు ఇలా
పవన్ మూడు పెళ్లిళ్లు పై వ్యాఖ్యానించిన నేతల వ్యవహార శైలి ఇప్పుడు బయటపడుతోంది. గతంలో పవన్ రాజకీయ విమర్శలు చేసిన ప్రతిసారి.. ఇదే దువ్వాడ శ్రీనివాస్ పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించేవారు. పవన్ పై వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు. కానీ ఇప్పుడు అది తప్పని తెలుసుకుంటున్నారు దువ్వాడ. మీడియా ముందే పశ్చాత్తాప పడుతుండడం విశేషం.