Duvvada Srinivas: 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారా? ప్రత్యేక ప్యానెల్ ఉంటుందా? రెండు కుటుంబాల ఓటమే ధ్యేయంగా రంగంలోకి దిగబోతున్నారా? ఇది సాధ్యమేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదో ఆసక్తికర వార్తే. అయితే ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైసీపీ సస్పెన్షన్ నేత, ఏ పార్టీతో సంబంధం లేని దువ్వాడ శ్రీనివాస్. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రముఖ జర్నలిస్టు ఇంటర్వ్యూలో పల్లుకొరికి మరీ ఈ విషయం తెలిపాడు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుపై ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటారు.. నరసన్నపేటలో ధర్మాన క్రిష్ణదాస్ పై ఇండిపెండెంట్ ఉంటారు.. టెక్కలిలో తాను ఉంటాను.. పలాసలో సైతం తన క్యాండిడేట్ ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పోటీ ఇవ్వగలరా? అసలు దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థులను బరిలో దించేతేమ నిలవగలరా? అనేది ఒక ప్రశ్న. అయితే పక్కా వ్యూహంతో దువ్వాడ శ్రీనివాస్ ఈ మాట అనగలుగుతున్నారా? లేకేంటే ఏదో సవాల్ విసరాలని అలా అంటున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారుతోంది.
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్ మధ్యలో టీడీపీ, జనసేన పార్టీల్లో పనిచేశారు. కానీ అది కొద్దిరోజులు మాత్రమే చివరాఖరుకు వైసీపీలో చేరి మూడుసార్లు ఆ పార్టీ ద్వారా పోటీచేశారు కానీ నెగ్గుకు రాలేకపోయారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆయన చేసిన ప్రయత్నం ఎంతమాత్రం వర్కువుట్ కాలేదు. జగన్ అవకాశం ఇచ్చినా ఎంతమాత్రం సాధ్యం కాలేదు. చివరకు జగన్ స్థాయి ప్రత్యర్థి కింజరాపు కుటుంబాన్ని ఎదుర్కొనాలంటే దువ్వాడ శ్రీనివాస్ లాంటి దూకుడు కలిగిన నేత అవసరమని భావించారు. కింజరాపు కుటుంబంపై కాలుదువ్విన దువ్వాడ లాంటి నేతకు ప్రోత్సాహం అందించారు. సొంత గెడ్డ నిమ్మాడ వెళ్లి తొడగొట్టిన దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చాలా స్వేచ్ఛనిచ్చారు. కానీ అవేవీ ఎన్నికల్లో నిలబడలేదు. దువ్వాడ సాహసం ఎంతమాత్రం అక్కరకు రాలేదు. అదే దువ్వాడ కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాల్లో చిక్కుకొని పార్టీకి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు దువ్వాడ తన వేటుకు కారణం ధర్మాన, కింజరాపు కుటుంబాలే కారణమని భావిస్తున్నారు. అందుకే ఆ రెండు కుటుంబాలను రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నారు. కానీ అది దువ్వాడ శ్రీనివాస్ కు సాధ్యమా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే ఆ రెండు కుటుంబాలకు రెండు బలమైన ప్రాంతీయ పార్టీల బలం ఉంది. కింజరాపు కుటుంబానికి టీడీపీ.. ధర్మాన కుటుంబాలని వైఎస్సార్సీపీ అండ ఉంది. అలా చెప్పడం కంటే ఆ రెండు పార్టీలకు ఆ రెండు కుటుంబాలే దిక్కు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తన బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారు. ఆ రెండు పార్టీల బలం లేకుండా వ్యక్తిగత చరిష్మతో రెండు కుటుంబాలను పడగొట్టాలని చూస్తున్నారు. అయితే ఆయన కులం కార్డును ప్రయోగించాలని చూస్తున్నారు. కానీ ఇప్పటికే వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో ఇబ్బందిపడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇండిపెండెంట్లను పెట్టి ఆ రెండు కుటుంబాలను పడగొట్టాలని చూస్తున్నారు. కులం కార్డును ఉపయోగించాలని చూస్తున్నారు. కానీ అది అంతగా వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.