Jagan Padayatra: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) వ్యూహం మార్చారా? 2029 ఎన్నికల్లో కొత్త ప్రయోగం చేయనున్నారా? దాదాపు సీనియర్లను పక్కన పెడతారా? యువతకు ప్రాధాన్యమిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల విద్యార్థి విభాగం నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు యువజన విభాగం ప్రతినిధులతో కూడా చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విస్తృత అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో యువతకు అవకాశం కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 50 శాతం నియోజకవర్గాలను యువతకు కేటాయిస్తారని సమాచారం. ఇప్పటికే దీనిపై సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2029 ఎన్నికల్లో కూటమి దూకుడుకు కళ్లెం వేయాలంటే సాహస నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
* వికటించిన ప్రయోగాలు..
మొన్నటి ఎన్నికల్లో ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 80 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వేరే నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. అటు నుంచి ఇటు నేతలను మార్చారు. ఆ ప్రయోగం సైతం వికటించింది. దారుణ పరాజయం ఎదురైంది. అలాగే చాలామంది నేతలు తమ వారసులను బరిలో దించాలని చూశారు. అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి కొందరికే అనుమతించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, పేర్ని నాని కుమారుడు కిట్టు లాంటి వారికే మాత్రం చాన్స్ ఇచ్చారు. ధర్మాన సోదరులు, తమ్మినేని వంటి వారికి అవకాశం కల్పించలేదు. వారి వారసులను బరిలో దించుతామంటే చాన్స్ ఇవ్వలేదు. కానీ ఎన్నికల్లో మాత్రం నేతల వారసులకు తప్పకుండా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి యువత అంటూ కొత్త పల్లవి అందుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు 50 మంది వరకు నాయకులు తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త యువకులు తెరపైకి వస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి 50 శాతం యువతకు టికెట్లు అని ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* కొనసాగుతున్న సర్వేలు..
అయితే జగన్మోహన్ రెడ్డి నేరుగా యువతకు ఇప్పట్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు కొనసాగుతున్నాయి. ఎవరికి అవకాశం ఇస్తాను అనుకుంటున్నారో..వారిపై నివేదిక తెప్పించుకుంటున్నారు. వారికి సర్వే ఫలితాలు అనుకూలంగా వస్తే నియోజకవర్గం బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నారు. 2027లో పాదయాత్రకు సన్నద్ధం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఎంపిక చేసిన యువతకు పాదయాత్ర నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. అందులో సక్సెస్ అయితే అప్పటికప్పుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటన చేస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ యువతతో పాటు విద్యార్థులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఓ 50 మంది నేతలు తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని గత ఎన్నికల్లోనే కోరారు. అటు ఇటుగా మరి కొంతమందికి టికెట్లు ఇస్తే 50 శాతానికి చేరుకుంటుంది. తద్వారా యువతతో పాటు విద్యార్థులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గుణపాఠా లు నేర్చుకోలేదు. వైసిపి హయాంలోనే విశాఖకు డేటా సెంటర్ వచ్చిందని.. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయని చెబుతున్నారు. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని విద్యార్థి సంఘాల నేతలతో పాటు పార్టీ యువజన విభాగాల ప్రతినిధులను సూచిస్తున్నారు. అయితే ఇది ఎంత మాత్రం వర్కౌట్ కాదు. ఇలాంటివి మానుకొని ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తేనే ప్రజలు గుర్తించేది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలామంది నేతలు ఉన్నారు. వారిని కాదని యువతకు అవకాశం ఇస్తే వారు ఊరుకుంటారా? లేదా? అన్నది చూడాలి.