Dussehra holidays in AP: ఏపీలో( Andhra Pradesh) దసరా సెలవులకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నట్లు స్పష్టం చేసింది విద్యాశాఖ. మొత్తం తొమ్మిది రోజులు పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్ మూడున పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఈనెల 20 నుంచి దసరా సెలవులు ప్రారంభం అవుతాయి. 20న ఆదివారం సెలవు దినం.. 21 నుంచి దసరా సెలవులు ఇవ్వడంతో తెలంగాణలో మొత్తం 12 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. అయితే తెలంగాణ మాదిరిగానే ఇక్కడ కూడా సెలవులు ప్రకటించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
ఏటా విద్యాసంస్థలకు సెలవు
ఏటా దసరా( Dasara ) సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు సంస్థలకు సైతం సెలవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పాఠశాలల కంటే కాలేజీలకు తక్కువ రోజులు సెలవులు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది సెలవులపై ముందుగానే స్పష్టత ఇవ్వాలనుకుంది ప్రభుత్వం. సాధారణంగా సెలవులు అంటేనే కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. హాస్టల్లో ఉండే విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఆపై సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అందుకే వారం రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం..
అయితే తెలంగాణ( Telangana) మాదిరిగా దసరా సెలవులను మరో రెండు రోజులపాటు ముందుగానే ఇవ్వాలని ఎమ్మెల్సీ గోపి మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల 22న దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా.. అదే రోజు నుంచి సెలవులు ప్రకటించాలని కోరారు. ఈనెల 21 ఆదివారం కావడంతో.. ఆ సెలవు దినంతో కలుపుకుంటే మొత్తం 12 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. పండుగ ప్రారంభం రోజు నుంచి ఇస్తే ఎంతో బాగుంటుందని ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇప్పటికే వర్షాలతో పాఠశాలలకు చాలా సందర్భాల్లో సెలవులు ప్రకటించారు. ఇప్పుడు రెండు రోజులపాటు ముందే సెలవులు ఇస్తే సిలబస్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో తల్లిదండ్రులు దసరా సెలవుల షెడ్యూల్ను రూపొందించుకుంటున్నారు.