Drone Ambulance Kurnool: అనారోగ్య,అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో రోగిని తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. సకాలంలో తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తేనే ప్రాణాలు నిలుస్తాయి. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. సకాలంలో అంబులెన్సులు( ambulances ), వాహనాలు లేక ఎంతో మంది మృత్యువాత పడుతుంటారు. సకాలంలో వైద్యం అందక సతమతం అవుతుంటారు. అయితే భవిష్యత్తులో అటువంటి సమస్యను అధిగమించే వీలుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆపై ప్రతి రంగంలోనూ డ్రోన్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో అత్యవసర, అనారోగ్య సమయాల్లో డ్రోన్లను సైతం అంబులెన్స్లుగా మార్చే పరిస్థితి కనిపిస్తోంది. అటువంటి డ్రోన్ ఆవిష్కరణ చేశారు కర్నూలు ట్రిపుల్ ఐటి విద్యార్థులు.
* ట్రాఫిక్ లో చిక్కుకుంటే..
సాధారణంగా రోడ్లపై వెళ్లి అంబులెన్స్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి.. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేవు. అంబులెన్స్లు రాకపోవడంతో సకాలంలో వైద్యం అందక చాలామంది మూల్యం చెల్లించుకుంటున్నారు. అయితే అలాంటి సమయంలో ఉపయోగంగా ఉండేలా డ్రోన్ అంబులెన్స్( Drone ambulance) రూపొందించారు కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. సాధారణ అంబులెన్సులు మధ్యలో నిలిచిపోతాయి. ఆ సమయంలో కొన్ని రకాల మందులు అందిస్తే రోగికి ఉపశమనంగా ఉంటుంది. అయితే అటువంటి సమయంలో రోగి బంధువులు ఇచ్చే సమాచారంతో కొన్ని రకాల మందులతో.. డ్రోన్ అంబులెన్స్ ను వెంటనే వారి వద్దకు పంపుతారు. డ్రోన్ కెమెరాలను అంబులెన్స్ లో, కంట్రోల్ రూమ్ లో ఉండేలా ఎలక్ట్రానిక్ తెరలతో అనుసంధానిస్తారు. దీంతో రోగి, శతకాత్రుల పరిస్థితిని అక్కడి డాక్టర్లు రియల్ టైం లో చూసి వైద్య సేవలు అందిస్తారు. డ్రోన్ కు ఉండే స్పీకర్ల సాయంతో వైద్యులు కంట్రోల్ రూమ్ నుంచి వారితో మాట్లాడవచ్చు. అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలను సూచించవచ్చు. వైద్యులు పారామెడికల్ సిబ్బంది అక్కడికి చేరేవరకు అంబులెన్స్ సిబ్బంది వైద్యుల సూచనలతో ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఇలా డ్రోన్ అంబులెన్స్ రూపొందించారు కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.
* మొదటి గంట కీలకం
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు( road accidents ) జరిగినప్పుడు మొదటి గంటలు అందించే చికిత్స కీలకం. అటువంటి పరిస్థితుల్లో డ్రోన్ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని ఐదు కిలోమీటర్ల వరకు పంపవచ్చు. అయితే ఒక్క వైద్య సేవలే కాదు గ్రామస్థాయిలో కూడా డ్రోన్ అంబులెన్స్ సేవలు వినియోగించుకోవచ్చు. గ్రామంలో రేషన్ ఇస్తున్నారని.. విద్యుత్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని.. కొళాయి రావడం లేదన్న సమస్యలను.. సమాచార రూపంలో దండోరా వేయించవచ్చు. కర్నూలు ట్రిపుల్ ఐటి విద్యార్థులు రూపొందించిన ఈ వినూత్న ఆవిష్కరణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.