CM Chandrababu: కూటమి నెలరోజుల పాలనలో కాపులు గుర్తుకు రాలేదా?

కూటమి ప్రభుత్వంపై కాపులు చాలా రకాలుగా ఆశలు పెట్టుకున్నారు. తమ బతుకులు మారుతాయి అని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తారని ఎదురుచూస్తున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో ముద్రగడ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఉద్యమం పతాక స్థాయికి చేరింది. చంద్రబాబు సర్కార్ స్పందించక తప్పలేదు.

Written By: Neelambaram, Updated On : July 13, 2024 1:08 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాల నాయకులు ఉన్నారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి ఆ పార్టీ పెద్దపీట వేస్తూ వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించి జగన్ సైతం బీసీ నేతలను చేరదీశారు. వారికి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. అయినా ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం జగన్ ను పెద్దగా ఆదరించలేదు. అప్పటికే కాపులు దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ రూపంలో కూటమికి దగ్గరయ్యారు. అందుకే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ లాంటి వారిని వైసీపీలోకి రప్పించారు జగన్. కాపు ఓట్లకు గండి పడకుండా కొంతవరకు అయినా చూస్తారని భావించారు. కానీ ఆ ఫార్ములా వర్కౌట్ కాలేదు. దాదాపు కాపు సామాజిక వర్గమంతా కూటమికి కొమ్ము కాసింది. ఏకపక్షంగా ఓట్లు వేయడంతో దాదాపు స్వీప్ చేసింది.

అయితే కూటమి ప్రభుత్వంపై కాపులు చాలా రకాలుగా ఆశలు పెట్టుకున్నారు. తమ బతుకులు మారుతాయి అని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తారని ఎదురుచూస్తున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో ముద్రగడ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఉద్యమం పతాక స్థాయికి చేరింది. చంద్రబాబు సర్కార్ స్పందించక తప్పలేదు. వెంటనే ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇచ్చే రేజర్వేషన్ ను ఐదు శాతం కల్పించారు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. చాలామంది కాపు నిరుద్యోగ యువత విదేశాలకు వెళ్లి చదువుకున్నారు. కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీ కోటాను రద్దు చేశారు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం నిలిపివేశారు.

టిడిపి కూటమి వైపు కాపులు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. జగన్ సర్కార్ పెట్టిన ఇబ్బందులు మరో కారణం. ఈ రెండు కారణాలతోనే కాపులు ఎక్కువమంది కూటమికి ఓటు వేశారు. కూటమి అధికారంలోకి వస్తే కాపులకు న్యాయం చేస్తుందని భావించారు. వారి ఆదరణతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి నెలరోజులవుతోంది. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ కాపులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు వెల్లడించకపోవడం విశేషం. ఈ బీసీ ఐదు శాతం కోటాను ఇంతవరకు ప్రకటించలేదు. కాపు కార్పొరేషన్ కార్యవర్గాన్ని నియమించలేదు. దానికోసం ప్రత్యేక నిధులు సైతం ప్రకటించలేదు. వాటన్నింటి కోసం కాపులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

జగన్ సర్కార్ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ దానికి నిధులు, విధులు కేటాయించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్సవ విగ్రహంగా మార్చారు. అప్పటికే మెజారిటీ కాపులు జనసేన వైపు వెళ్లారని భావించిన జగన్.. వారికోసం నిధులు ఖర్చు చేయడం దండగ అన్న రీతిలో వ్యవహరించారు. అందుకే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఈ బీసీ కోటాను రద్దు చేశారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. మిగతా సామాజిక వర్గాల కార్పొరేషన్ల మాదిరిగా చూశారే తప్ప.. ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కాపుల్లో వ్యతిరేకతకు ఇదే ప్రధాన కారణంగా మారింది. అయితే జగన్ రద్దు చేసిన పథకాలను ఇంతవరకు.. చంద్రబాబు సర్కార్ పునరుద్ధరించకపోవడం కాపుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మొన్న ఆ మధ్యన మంత్రి కందుల దుర్గేష్ ను కాపు సంఘం ప్రతినిధులు కలిశారు. సమస్యలను విన్నవించారు. డిప్యూటీ సీఎం పవన్ కు వివరించాలని కోరారు. అయితే త్వరలో కాపులకు సంబంధించిన నిర్ణయాలను చంద్రబాబు సర్కార్ ప్రకటించే అవకాశం ఉంది.